పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/309

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎంత త్వరగా నశిస్తే అంత మంచిది, కాని బైబులు సంప్రదాయం ప్రకారం దేవుని సృష్టిలోని అన్ని వస్తువుల్లాగే దేహంకూడ మంచిది. అది ఉత్తానమై దేవుణ్ణి చేరుతుంది. కనుక మనం దాన్ని గౌరవంతో చూడాలి. దాన్ని పాపానికి దూరంగా ఉంచాలి. ఉత్థాన భాగ్యాన్ని పొందడానికి తగినట్లుగా పవిత్రంగా ఉంచాలి. దైనందిన జీవితంలో ఆత్మ దేహాన్ని నడిపించాలి కాని దేహం ఆత్మను నడిపించకూడదు. ఈ లోకంలో శరీరం పశుప్రవృత్తితో నిండివుండి వెర్రిపోకడలు పోతూంటుంది. కనుక దాన్ని నిరంతరమూ అదుపులో ఉంచుకొంటూండాలి.

5.ఆధునిక యుగం లైంగిక యుగం. ప్రచార సాధనాలైన సినిమా, పత్రికలు మొదలైనవి నరదేహాన్ని - విశేషంగా స్త్రీదేహాన్ని - కామపూరితంగా ప్రదర్శించి సొమ్ము చేసికొంటూంటాయి. లోకంలో స్త్రీ పురుషులు ఒకరి దేహాన్నొకరు కామదృష్టితో చూస్తూంటారు. కాని క్రైస్తవులమైన మనకు దేహంపట్ల - అది పురుష దేహమైనా స్త్రీ దేహమైనా - పవిత్ర భావాలుండాలి. అది వోనాడు ఉత్థానమై దేవుని సన్నిధిని చేరేది. ఈ లోకంలో ఉండగానే దేవుని ఆత్మకు ఆలయంగా వొప్పేది. ఈలాంటి తనువుని మనం దేవుని ఆలయంగానే చూడాలి. ఇంకా, దేవుని మందిరమైన ఈ శరీరాన్ని వ్యభిచారంతో కళంకితం చేయకూడదు. పౌలు కొరింతీయులకు వ్రాస్తూ దేహంతోను పాపం చేయవద్దు, దేహంలోను పాపం చేయవద్దు అని హెచ్చరించాడు - 1కొ 6,18-19.
6.ఉత్తాన క్రీస్తు మన ఉత్తానానికి మాదిరిగాను కారణంగాను ఉంటాడని చెప్పాం. ఉత్థాపిత మాతయైన మరియకూడ మనకు ప్రేరణంగా ఉంటుంది. కేవలం మానవమాత్రురాలైన ఆ తల్లి ఉత్తానమై యిపుడు మోక్షంలో ఉంది. ఆమెకు అబ్బిన భాగ్యమే ఓనాడు మనకూ అబ్బుతుంది. ఆమె పరలోకంలో ఉండి మనలను తనచెంతకు పిలుస్తుంది. తన శరీరంలాగే మన శరీరంగూడ మహిమను పొందుతుందని మనకు ఆశ పుట్టిస్తుంది.
7.శరీరంలాగే ఈ లోకంకూడ చెడ్డదికాదు, మంచిది. అది నాశంకాదు, మహిమను పొంది క్రొత్తరూపం తాలుస్తుంది. కనుక ఈ లోకాన్నీ ఇక్కడి భౌతిక వస్తువులనూ