పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టింది. ఆ యంతస్తే ఆమెను విశ్వానికి రాజ్ఞిగాగుడ చేసింది. ఆ తల్లి మధ్యవర్తియైన క్రీస్తుతో సహకరించి పనిచేసిందన్నాం. ఆమె క్రీస్తు అనే రాజుకు సహాయురాలుగా నిలిచింది. కనుకనే ఆ ప్రభువు రాచరికంలో తానూ పాలుపొంది మనరాణి ఔతుంది.

క్రీస్తు తాను ఆర్జించిన రక్షణంద్వారా మనకందరికీ ప్రభువయ్యాడు. ఆ రక్షణంలో పాల్గొనిన మరియమాతకూడ మనకు రాజ్ఞి ఔతుంది. దైవరాజ్యాన్ని స్థాపించడానికి క్రీస్తు మరియమాతా ఇద్దరూ పాటుపడ్డారు. ఆ రాజ్యానికి క్రీస్తు రాజైతే, మరియ రాజ్ఞి కాదా?

పిత,సుతుడు,ఆత్మ- ఈ మువ్వురు దైవ వ్యక్తులూ ఆమెను రాజ్ఞిగా నియమించి కిరీటం వుంచారు. శ్రీసభ ఆమెను రాజ్ఞిగా ఎన్నుకొని మరియరాజ్ఞి మహోత్సవం అనే పండుగను నెలకొల్పింది. ఆమె రాజ్యం క్రీస్తురాజ్యమంత విస్తీర్ణమైంది. భూమిమీద, ఉత్తరించే స్థలంలోకూడ ఆమె రాచరికం చెల్లుతుంది. ఆ రాజ్ఞి నరకంలోని పిశాచాలకు గర్వభంగం కలిగిస్తుంది. దేవునికి ఓడిపోతే పోయ్యాంగాక, ఈ సృష్టి ప్రాణికికూడ ఓడిపోయాంగదా అని పిశాచాలు సిగ్గుతో మ్రగ్గిపొతాయి. మోక్షంలోని పూర్వనూత్న వేదాల పునీతులకూ, దేవదూతలకూ మరియ రాజ్ఞి ఔతుంది. ఈ విధంగా భూమిమీద, మోక్షంలో నరకంలో - అంతటా ఆమె ప్రాభవం చెల్లుతుంది. క్రీస్తు ఎన్నాళ్ళు ఎంతవైభవంగా రాజ్యపాలనం చేస్తాడో ఆమెకూడ అన్నాళ్ళు, అంతవైభవంగా రాజ్ఞిగా ఉండిపోతుంది. ఆ కుమారుడు ఆ తల్లి పరిపాలించే రాజ్యానికి అంతమే వుండదు.

క్రీస్తు రాజు అన్నా కాని ఆ ప్రభువు రాచరికం అధికారం చెలాయించడంకోసం గాదు, సేవచేయడంకోసం. "మనుష్య కుమారుడు సేవలు చేయించుకోవడం కోసం గాదు, సేవలు చేయడంకోసం వచ్చాడు" - మార్కు 10,45. ఈ క్రీస్తురాజు లాగే మరియరాజ్ఞికూడ మనకు సేవలు చేస్తుంది. మరియ సేవ ఆమె వేడుకోలే. ఇక క్రీస్తురాజుతో పాటు మనమూ రాచరికం చేస్తాం. క్రీస్తురాజుతోపాటు, మరియ రాజ్ఞితోపాటు మనమూ పరిపాలనం చేస్తాం - 2 తిమో 2, 12. ఆ ప్రభువుని ఆరాధించి సేవించడమే రాచరికం.

3. భక్తి భావాలు

మరియరాజ్ఞిని మనం సేవిస్తుండాలి. మన పనులు కష్టసుఖాలు ఆ తల్లికి అర్పించుకోవాలి. మన జపతపాలు భక్తిక్రియలు, పుణ్యకార్యాలు ఆ రాజ్ఞికి కానుక పెట్టాలి.

ఈ రాజ్ఞికి పిశాచం శత్రువు. ఆమె పిశాచం తల నలగధ్రొక్కుతూంది. నిత్యం పోరాడి ఆ పిశాచాన్ని నరకానికి తరిమివేస్తూంటుంది. ఇటువంటి పిశాచాన్ని మనం సేవించకూడదు. దానితో చేతులు కలుపనూకూడదు. మనం పాపం చేసేప్పడూ, దురభ్యాసాలకు లొంగిపోయేప్పడూ ఆ రాజ్ఞిని సేవించకుండా పిశాచాన్ని సేవిస్తుంటాం. అది ఆ తల్లికి కోపాన్నీ దుఃఖాన్నీ కలిగిస్తుంటుంది.