పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేహాత్మలతో మోక్షం జేరుకొనిన మరియను ముగ్గురు దైవవ్యక్తులు ఆదరించి మహిమ పరుస్తారు. దేవునికి తల్లియైనందుకు తగినట్లుగా, మన రక్షణంలో పాల్గొన్నందుకు తగినట్లుగా, ఆ సర్వమంగళను సన్నుతిస్తారు. నీతిమంతులు ఏలాంటి మహిమను పొందుతారో మనం ఊహించనైనా ఊహించలేం అంటాడు పౌలు. జీవితమంతా పాపం విడనాడి నిర్మలజీవితం జీవించిన మరియకు ఏలాంటి మహిమ సిద్ధిస్తుందో మనం మాత్రం ఊహించగలమా? పునీతులు, కన్యలు, స్తుతీయులు, వేదసాక్షులు, దేవదూతలు మొదలైన వాళ్ళందరికంటె ఆమె స్థానం గొప్పది. వాళ్ళందరికీ ఆమె రాజ్ఞి. చుక్కలన్నిటికంటె సూర్యుడెక్కువ. మోక్షవానులందరికంటె మరియమాత యొక్కువ. అన్ని గ్రహాలూ సూర్యునినుండి వెలుగును పొందుతాయి. ఆమె మహిమ నుండి అందరూ పునీతులూ మహిమను పొందుతారు. మోక్షవాసులందరూ మొదట దేవునియందు సంతోషిస్తారు. ఆ పిమ్మట మరియమాతయందు సంతోషిస్తారు. ఆమె మహిమ వాళ్ళ మహిమ. ఆమె వాళ్ళందరికీ రాజ్ఞి. ఈలా మోక్షంలో క్రీస్తు సమీపంలో మరియమాత, మరియమాత సమీపంలో సకల పునీతులూ శాశ్వతంగా వసిస్తుంటారు.

3. భక్తిభావాలు

మరియమాత మహిమకు మనమూ సంతోషించాలి, మన నరజాతికి చెందిన ఓ స్త్రీదేహాత్మలతో నేడు మోక్షంలో వుందంటే మనకే గౌరవం, మన మానవజాతికంతటికీ మహాలంకారం ఉత్థాపితమాత.

మరియ దేహంలాగే మన దేహమూ ఉత్తాపనమౌతుంది. క్రీస్తు ఉత్తానంలో మరియు పాలుపొందింది. ఆమెలాగే మనంకూడ పాలుపొందుతాం. ఓ రోజు ఉత్థానమౌతాం. అందుకే "శరీరం యొక్క ఉత్తానాన్ని విశ్వసిస్తున్నాను" అంటాం. ప్రభువు మళ్ళా విజయంచేసి మన యీ దీనశరీరాన్ని మహిమాన్విత శరీరంగా మార్చాలని కోరుకుంటాం. ఆయన రెండవ రాకడకోసం కనిపెట్టుకొని వుంటాం – ఫిలి-3,21. ఈలా ఉత్తానంకోసం ఎదురుచూచే క్రైస్తవ ప్రజకు ఉత్తాపితమాత ఓ ద్రువతారలా దారిచూపుతుంది. ఆమె మనలనూ తన చెంతకు పిల్చుకుంటుంది.

మరియమాత దేహంలాగే మన ఈ దేహంకూడ ఉత్థానమై దేవుని యెదుట మహిమను పొందుతుంది అన్నాం. ఈ దేహం ఓనాడు దేవుని యెదుట నిలుస్తుంది. అలాంటి ఈ దేహాన్ని మనం పవిత్రభావాలతో చూస్తూండాలి. ఈ దేహం జ్ఞానస్నానంద్వారా దేవుని ఆత్మకు మందిరమౌతుంది. తేపతేపకు క్రీస్తునే ఆహారంగా పుచ్చుకొంటుంది. కడన ఉత్థానమై ప్రభుసన్నిధిలో నిలుస్తుంది. కనుక ఈ దేహం పవిత్రమైంది. పురుషదేహమైనాసరే