పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొక్కటే. క్రీస్తుతనంతటతాను ఉత్థానంమయ్యాడు. మరియమాత తనంతటతాను ఉత్థానం కాలేదు. ప్రభువే ఆమె దేహాన్ని ఉత్తాపనం చేసాడు. అనగా లేపాడు. కనుకనే ఆమె దేహం మోక్షాన్ని చేరింది.

2. ఉత్థాపన కారణాలు

దేవుడు మరియమాత దేహాన్ని ఎందుకు ఉత్థాపనం చేసినట్లు? పాపం ద్వారా నరునికి మరణం సిద్ధించింది -1కొ15,56. మరణం చెందిన దేహాలు మన్నైపోతాయి. కాని మరియకు పాపమంటూ లేదు. ఆమె నిష్కళంకమాత, అంచేత ఆమె దేహం పాపశిక్షగా క్రుళ్ళి మన్నై పోవలసిన అవసరం లేదు. నేరుగా మోక్షానికి వెళ్తుంది. మరి ఆమె చనిపోవడం మాత్రం దేనికి? మరియ చనిపోయింది తాను పాపాత్మురాలు కావడంవల్ల కాదు. క్రీస్తుకు పోలికగా వుండడంకోసం. నరజాతికి శిరస్సెన క్రీస్తు చనిపోయాడు కనుక నరులంతా చనిపోవలసిన ధర్మం వుంది. కనుక మరియ కూడ చనిపోయింది. (అసలు ఆమె చనిపోనేలేదు, చనిపోకుండానే నేరుగా మోక్షానికి వెళ్ళిపోయింది అని ప్రాచీన క్రైస్తవ వేదశాస్త్రజ్ఞలు కొంతమంది నుడివారు. కాని అందరూ ఈ వాదాన్ని అంగీకరించరు. మరియ మరణాన్ని గూర్చి మనకేమీ స్పష్టంగా తెలియదు. శ్రీసభ ఈ విషయంలో అధికారపూర్వకంగా ఏమీ బోధించలేదుకూడ.)

క్రీస్తుతోపాటు మరియకూడ మన రక్షణంలో పాల్గొంది. మన వినాశం ఒక పురుషుడు ఒక స్త్రీ ద్వారా, అలాగే మన ఉద్ధరణంకూడ ఒక పురుషుడు ఒక స్త్రీ ద్వారా, తొలి ఆధాము తొలియేవ తెచ్చిపెట్టిన పతనానికి రెండవ ఆదాము రెండవ యేవ ప్రాయశ్చిత్తంచేసి ఉద్ధరణం కలిగించారు. ఇక, ఈ రెండవ ఆదాము దేహం మోక్షంలో మహిమను పొందింది. అతనితో కలసి రక్షణరంగంలో కృషిచేసిన రెండవయేవ దేహంకూడ మహిమను పొందాలి. అలా పొందడమే మరియమాత ఉత్థాపనం.

క్రీస్తుకి ఆ తల్లిపట్ల అపార గౌరవమూ ప్రేమా వుంటుంది. తన్ను ధరించిన ఆ పునీత దేహం క్రుళ్ళి పరుగులకు మేలైపోవడానికి, మన్నెపోవడానికి, క్రీస్తు అంగీకరిస్తాడా? తన్నుకని చనుబాలతో పెంచి, ముద్దాడి పెద్దజేసిన ఆ తల్లి పునీత దేహాన్ని ఆ కుమారుడు ఎలా గౌరవించాలో అలాగే గౌరవించి తీరుతాడు. జీవవంతుడైన దేవుడు ఆమెకు జీవమిచ్చి వెలుగులోకి తీసుకవెళ్ళాడు. క్రీస్తు ఎక్కడవుంటే ఆ తల్లి అక్కడే వుంటుంది. క్రీస్తును గౌరవించాక ఆ తల్లిని గౌరవించాలి. పూర్వవేదపు మందసం కొయ్యలాగ ఆమె దేహం చెరువు నెరుగదు.