పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేళవించింది. అతనితో పాటు తానూ ఇంచుమించుగా చనిపోయింది. తల్లి హక్కులన్నిటినీ విడనాడి క్రీస్తును పరలోకపితకు అర్పించింది. సిలువమీద ఓ బలి అర్పింపబడుతూంటే ఆమె హృదయంలోకూడ ఓ బలి అర్పింపబడింది. ఈలా క్రీస్తును కల్వరి కొండమీద పితకు అర్పించింది. మరియ ఈ యర్పణం ద్వారా క్రీస్తుతోపాటు తానూ మన రక్షణంలో పాల్గొంది. మరియ సహకారం ద్వారా క్రీస్తు స్త్రీ పురుషుల పాపాలకుగూడ పరిహారం చేసినట్లయింది.

మరియ తొలిబిడ్డను కన్నపుడు ఏ బాధా అనుభవించలేదు. కాని కల్వరిమీద మలిబిడ్డలమైన మనలను కన్నపుడు ఎంతైనా బాధ అనుభవించింది. "ఇదిగో నీ కుమారుడు" అని క్రీస్తు నుడివినపుడు, ఆ మాటలద్వారా జ్ఞానవిధంగా తాను మనకు తల్లి ఐనపుడు, మరియ పుట్టెడు దుఃఖం అనుభవించింది. ఈలా ఆమె బాధామయమాతగానే మన రక్షణంలో పాల్గొంది.

ఈలా క్రీస్తుతోపాటు మన రక్షణంలో పాల్గొనేందుకే మరియ నిష్కల్మషగా పవిత్రురాలుగా పదిలపరచబడింది. తానే పాపాత్మురాలైనట్లయితే మనరక్షణంలో పాల్గొని వుండలేదు. తొలిస్త్రీ పాపాత్మురాలై మన నాశంలో పాల్గొంది. ఈ రెండవ స్త్రీ పునీతురాలై మనరక్షణంలో పాల్గొంది.

మూడవది, మరియ మోక్షంనుండిగూడ మన రక్షణంలో పాల్గొంటుంది. ఆమె ఈ లోకంలో వుండగా నరులకు సాయపడింది. ఆమె సాన్నిధ్యం ద్వారా యొలిసబేతు గర్భంలోని యోహాను పునీతుడయ్యాడు - లూకా 1, 44. ఆమె వేడుదలద్వారా ప్రభువు కానావూరిలో నీరు ద్రాక్షసారాయంగా మార్చాడు. యెరూషలేము మీదిగదిలో ఆమె శిష్యులు పరిశుద్ధాత్మను పొందాలి అని ప్రార్ధనం చేసింది - అచ 1,44. ఈలా భూమిమీద జీవించి వున్నపుడు నరులకు సాయపడుతూ వచ్చిన మరియు మోక్షంలో వుండిమాత్రం మనలను మరచిపోతుందా? ఆమె స్వర్గంలో ఉండి అహోరాత్రులూ మన రక్షణకోసం క్రీస్తుని మనవిచేస్తుంది. మనం పిశాచం చేతుల్లో చిక్కుకోకుండా వుండేలా తోడ్పడుతుంది.

ఈలా మరియ క్రీస్తు జననమందు, కల్వరిచెంత, మోక్షంనుండి మన రక్షణంలో పాల్గొంది. క్రీస్తుతోపాటు ఆమెకూడ మనలను రక్షించింది. కావున మరియ సహరక్షకి, రక్షణమాత.

3. రక్షణమాతపట్ల భక్తిభావాలు

మరియ క్రీస్తు శిశువును ప్రేమించినంతగా భూలోకంలో ఏ తల్లికూడ తన బిడ్డను ప్రేమించి యెరుగదు. ఐనా ఈ మరియ తన బిడ్డను మన రక్షణకోసం అర్పించడానికి