పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెనుదీయలేదు. ఈలాగే క్రైస్తవ తల్లిదండ్రులు కూడ తమ బిడ్డలను క్రీస్తు సేవకు సమర్పించడానికి వెనుకాడకూడదు.

క్రీస్తు జన్మించినపుడూ చనిపోయేప్పడూ ఆ ప్రభుని మరియ పరలోకపితకు అర్పించిందన్నాం. నేడు మనంకూడ పూజలో క్రీస్తుని భక్తితో పరలోకపితకు అర్పించుకునే భాగ్యంకోసం వేడుకుందాం. మరియ గర్భసీమలో గోదుమ పైరు పంటపండింది. ద్రాక్ష పండ్లు కాసింది. ఆ తల్లి మనకు స్వర్గపు రొట్టెను స్వర్గపు రసాన్ని అందిస్తుంది. ఈ రొట్టెను భుజించి ఈ రసాన్ని పానంచేసి ఆకలి తీర్చుకుందాం, సంతృప్తిచెందుతాం.

మరియ రక్షణమాత. కనుక ఆమెను మనకోసం మనవి చేయమందాం. అశ్రద్ధవల్ల మనమాతల్లిని మరచిపోయినా ఆ తల్లి మాత్రం మనలను మరచిపోకుండా వుండాలని విన్నవించుకుందాం.

విశేషంగా మరణ సమయంలో ఆమె మన రక్షణ మాతగా వ్యవహరించాలని మనవి చేసికుందాం. "ఇప్పడూ మా మరణ సమయమందూ ప్రార్ధించ" మని బ్రతిమాలుకుందాం.

5. ఉత్తాపితమాత


స్యూడో అగస్టిన్ అనే ఎన్మిదవ శతాబ్దపు రచయిత మరియనుగూర్చి ప్రస్తావిస్తూ "మరియమాతదేహం క్రీస్తుకు మందసంగా వుండిపోయింది. కనుక ఆ కుమారుడు ఉన్న కాడే ఆ తల్లి దేహంకూడ వుండిపోవడం సముచితం. ఏ దేహంనుండి క్రీస్తు తనదేహాన్ని చేకొన్నాడో ఆ పునీతదేహం ప్రాణం విడిచాక క్రుళ్ళి మన్నయి పోయిందంటే, పరుగులకు మేతయిపోయిందంటే, నాకు నమ్మబుద్ధి ఫుట్టడం లేదు. కనుక ఆమె దేహం క్రీస్తు సన్నిధిని చేరి వుండాలి" అని వ్రాసాడు. మరియమాత ఉత్థాపితమాత ప్రస్తుతం ఉత్తాపితమాతను గూర్చి మూడంశాలు విచారిద్దాం.

1. ఉత్ధానం అంటే యేమిటి?

మనం చనిపోయాక మన యీ దేహాలు ఇక్కడే మన్నై పోతాయి. కాని మరియమాత దేహం అలా మన్నైపోలేదు. ప్రభువు ఆమెను దేహాత్మలతో మోక్షానికి తీసికొని వెళ్ళాడు. మరియ ఆత్మతోపాటు దేహంకూడ ప్రభు సన్నిధిలో మహిమను పొందింది. ప్రస్తుతం మానవ మాత్రుల దేహాలేవీ మోక్షంలో లేవు. పునీతుల ఆత్మలు మాత్రమే మోక్షంలో వుంటాయి. పునీతుల దేహాలైనాసరే మన దేహాలైనాసరే లోకాంతంలో గాని ప్రభు సన్నిధిని చేరవు. కనుక ప్రస్తుతం క్రీస్తు మినహా, మోక్షంలోవున్న మానుషదేహం మరియమాత

                                                             19