పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు సొలోమోనుకి విజ్ఞాన వరాన్ని ప్రసాదించాడు కదా! అది వెంటనే అతనిలో పనిజేయడం మొదలుపెట్టింది. ఆ రాజు తన విజ్ఞానాన్ని రుజువు చేసికొనే అవకాశంగూడ వెంటనే దొరికింది.

ఓరోజు ఇద్దరు వేశ్యలు జగడమాడుకొని రాజు దగ్గరికి తీర్చుకు వచ్చారు. మొదటియామె రాజుతో ఈలా చెప్పింది. దొరా! మేమిద్దరం ఒకే యింటిలో వసిస్తున్నాం. ఈమెకూ నాకూ మూడురోజుల తేడాతో మగబిడ్డలు పుట్టారు. ఒకరేయి ఈమె నిద్రమంపులో తన బిడ్డడిమీదికి పొరలి వాణ్ణి చంపివేసింది. కాని తెలివితో ఆరాత్రే తన బిడ్డట్టితెచ్చినా ప్రక్కలో పరుండబెట్టి నా కుమారుడ్డి తీసుకవెళ్ళి తన ప్రక్కలో పండబెట్టుకొంది. నేను ఉదయాన్నే శిశువుకి పాలీయబోగా వాడు చనిపోయి వున్నాడు. జాగ్రత్తగా పరిశీలించి చూచి వాడు నా బిడ్డడు కాదని తెలిసికొన్నాను అని చెప్పింది. వెంటనే రెండవవేశ్య అందుకొని ఏలికా! బ్రతికివున్నవాడు నా బిడ్డడు. చచ్చినవాడు ఆమె బిడ్డడే అని పలికింది. మొదటి వేశ్య రెండవ వేశ్యకు అడ్డువచ్చి బ్రతికి వున్నవాడు నావాడు, చచ్చినవాడే నీవాడు అని వాదించింది.

రాజు ఇరువురి వాదాన్ని విన్నాడు. దేవుడిచ్చినవరం అతన్ని ప్రేరేపించింది. అతడు నిజమైన తల్లిని గుర్తుపట్టే విధానాన్ని మనసులోనే ఊహించుకొన్నాడు. బయటికి ఏమీ చెప్పకుండా, బ్రతికివున్న బిడ్డణ్ణి రెండు ముక్కలుగా నరికి ఇద్దరికి చెరియొక ముక్కనివ్వమని సేవకుణ్ణి ఆజ్ఞాపించాడు. బంటు కత్తి తీసికొని అలాగే నరకబోగా కన్నతల్లికి కడుపు తరుగుకొనిపోయింది. ఆమె ప్రభూ! బిడ్డను చంపవద్దు. వాణ్ణి ఈమెకు ఈయండి. నా బిడ్డడు ఎక్కడవున్నా ఫర్వాలేదు. వాడు బ్రతికివుంటే చాలు అంది. కాని రెండవ తల్లి ఈబిడ్డడు ఎవరికీ దక్కకూడదు. వీణ్ణి రెండు ముక్కలుగ నరికివేయవలసిందే అని అసూయతో పలికింది. వారి మాటలనుబట్టే సాలోమోను ఎవరు నిజమైన తల్లో, ఎవరు దొంగ తల్లో నిర్ణయించాడు. నిజమైనతల్లి తన బిడ్డడు చనిపోవడానికి ఒప్పకోదు కదా! కడుపుతీపి ఆమెకు అడ్డువస్తుంది కదా! ఈవిధంగా సొలోమోను తెలివితో నిజమైన తల్లిని గుర్తుపట్టి బిడ్డణ్ణి ఆమెకే యిప్పించాడు.

అంతవరకు యిస్రాయేలు పెద్దలకు సాలోమోను సామర్థ్యం తెలియదు. వాళ్ళ మన రాజు కుర్రవాడు. ఇతనికి దావీదుకున్న అనుభవం లేదు. ఇతడు ప్రజలను చక్కగా పరిపాలించగలడా అని శంకిస్తున్నారు. ఈ తీర్పు విన్న తర్వాత వాళ్ళకు సొలోమోనుమీద నమ్మకం కుదిరింది. వాళ్లు ఇతడు తండ్రిని మించిన తనయుడు అనుకొన్నారు. అతన్ని చూచి భయపడ్డారు. భగవంతుడు అతనికి ప్రసాదించిన విజ్ఞాన వరాన్ని గుర్తించి విస్తుపోయారు.