పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ప్రార్థనా భావాలు

1.యూదుల దృష్టిలో మోషే ధర్మశాస్తానికి ప్రసిద్ధి. సొలోమోను విజ్ఞానానికి ప్రసిద్ధి. విజ్ఞానమంటే యేమిటి? దేవునిపట్ల భయభక్తులు చూపడం విజ్ఞానానికి మొదటిమెట్టు అంటుంది సామెతలగ్రంథం 9, 10. కనుక విజ్ఞానమంటే దైవభీతీ, దైవభక్తి. దీన్నే మనం నూత్నవేదంలో వరప్రసాదం అంటాం. ఈ వరంతో మంచిచెడ్డలను గుర్తిస్తాం. చెడ్డను విసర్జించి మంచిని సాధిస్తాం. యోగ్యరీతిని ప్రవర్తించి విజయాన్నిచేపుతాం. ఇహలోక వస్తువులకంటె పరలోక వస్తువులమీద అధికప్రీతిని చూపుతాం. సంగ్రహంగా చెప్పాలంటే, వివేకంతో మంచి జీవితం గడపడమే విజ్ఞానం. ఈ వరం సాలోమోనుకిలాగే మనకుకూడ అత్యవసరం. కనుక అతనిలాగే మనంకూడ దేవునినుండి ఈ భాగ్యాన్ని అడుగుకోవాలి.

2.ప్రజలకు మేలు కలిగేలా పరిపాలించడం, వారికి న్యాయబుద్ధితో తీర్పుచెప్పడం సాలోమోను బాధ్యత. ఈ స్వీయ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి అతడు విజ్ఞాన వరాన్ని అడుగుకొన్నాడు. ఎవరి బాధ్యతలను వాళ్లు తృప్తికరంగా నిర్వహించాలి. వృత్తి ధర్మాన్నిసక్రమంగా పాటిస్తే దేవుణ్ణి ఆరాధించినంత. ఈనాడు మనం మన బాధ్యతలను ఏలా నిర్వహిస్తున్నాం? తల్లిదండ్రులంగా, పెద్దలంగా, ఉపదేశులంగా, ఉపాధ్యాయులంగా, మఠకన్యలంగా, గురువులంగా మన బాధ్యతలను మనం సక్రమంగా నిర్వహిస్తున్నామా? ఈ విషయంలో సొలోమోను మనకు ప్రేరణంగా వుంటాడు.

3.ప్రభువు సొలోమోనుతో నీవు నా యాజ్ఞలను పాటించి నాకు విధేయుడవైతే నేను నీకు దీర్గాయువును గూడ ప్రసాదిస్తాను అని చెప్పాడు. కాని విజ్ఞానవరాన్ని బడసిన సొలోమోనే దేవుని ఆజ్ఞలను పాటించలేదు. అతడు మోషే ధర్మశాస్తాన్నిమీరి వివిధ జాతుల ఆడపడుచులను పెండ్లి చేసికొన్నాడు.వాళ్ళకు పుట్టింటి దేవుళ్లుండేవాళ్లు. సాలోమోను ఈ రాణులకు వశుడైపోయి వాళ్ళ కొలిచే దేవతలను కొలిచాడు. వాళ్ళకు దేవళాలు కట్టించాడు. విగ్రహారాధనలో పడిపోయాడు. తన తండ్రియైన దావీదులాగ పూర్ణహృదయంతో దేవుణ్ణి సేవించలేదు. కనుక దేవుడు సాలోమోను మీద కోపించి అతని రాజ్యాన్ని రెండు ముక్కలుగా చీల్చివేసాడు. ఒక ముక్కకు అతని కుమారుడు రాజుకాగా మరో ముక్కకు అతని బానిస యరోబాము రాజయ్యాడు- 1రాజు 11,1-12. అతడు ప్రభువుని త్యజించాడు కనుక ప్రభువు అతన్ని త్యజించాడు. సొలోమోనువంటి జ్ఞాని పడిపోతే ఇక మనబోటివాళ్ళం నిలువగలమా? ఆ రాజులాగే మనంకూడ మన అంతస్తుని