పుట:Bible Bhashya Samputavali Volume 10 Devamata,Antyagatulu P Jojayya 2003 332 P.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిద్రపడుతుంది. లేకపోతే ఎరక్కతిని అరక్క చావవలసి వస్తుంది. భోజనప్రీతివల్ల చాలమంది చచ్చారు. ఎప్పుడుగూడ ఎవరికి గిట్టే ఆహారమే వాళ్ళ తినాలి.

విందును ఆరగించడానికి కూర్చున్నపుడు
          నోరు విప్పి చూడకు
          ఇక్కడ భోజనపదార్ధాలున్నాయని
          ఆశ్చర్యవచనాలు పల్కకు
          దృష్టిదోషం చెడ్డదని తెలిసికో
          సృష్టిలో కంటికంటె పేరాసకలది యేదీలేదు
          కనుకనే అది మాటిమాటికి నీరు కార్చుతూంటుంది
          నీ కంటికి కన్పించిన పదార్థాలన్నీ తీసికోవద్దు
          వాటిని తీసికొనేప్పడు తోడివారిని ప్రక్కకు త్రోయవద్దు
          ఇతరుల కోరికలు నీ కోరికలవంటివే
          కనుక ఇతరులను అర్థంచేసికొని ఆదరంతో మెలగు
          నీకు వడ్డించిన భోజనాన్ని మర్యాదగా తిను
          ఆత్రంతో తింటే యెల్లరికీ రోతపుట్టిస్తావు
          భోజనంచేసి ముగించేవారిలో
          నీవు మొదటివాడవైతే మర్యాదగా వుంటుంది
          మితిమీరి తింటే జనులు నిన్ను మెచ్చరు
          పదిమందితో కలసి భుజించేపుడు
          అందరికంటె ముందుగా నీవు పదార్థాలు తీసికోవద్దు
          మర్యాద తెలిసినవాడు స్వల్పంగా భుజిస్తాడు
          కొద్దిగా తింటే నిద్రించేపుడు ఆయాసపడనక్కరలేదు
          మితభోజనం వలన బాగుగా నిద్రపడుతుంది
          వేకువనే ఉత్సాహంతో మేల్కొనవచ్చు
          మితంమీరి తింటే కడుపునొప్పి
          నిద్రపట్టకపోవడం దాపురిస్తాయి
          కుమారా! ఈ జీవితయాత్రలో
          నిన్ను నీవు పరీక్షించి చూచుకొంటూండు
          నీకు గిట్టని భోజనపదార్థాలు తినకు
          ప్రతిభోజనం ప్రతివానికీ సరిపడదు