పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

{{center

4. గురుపట్ట ఫలితాలు

}}

ఈ యధ్యాయంలో నాల్గంశాలను పరిశీలిద్దాం. గురుపట్ట ఫలితాలు మూడు. అవి అక్షయమైన ముద్ర, త్రివిధాధికారం, వరప్రసాదం. ఈ మూడంశాలను క్రమంగా విలోకిద్దాం.

1. అక్షయమైన ముద్ర

గురుపట్టంద్వారా గురువు అక్షయమైన ముద్రను పొందుతాడు. ఈ ముద్ర ఏనాటికి చెరగిపోదు. కనుకనే ఒకసారి గురుపట్టాన్ని పొందినవాళ్ళు ఆ దేవద్రవ్యానుమానాన్ని మళ్లా పొందడానికి వీల్లేదు. ఎందుకంటే అది శాశ్వతంగా వుండిపోతుంది.

ఈ ముద్రద్వారా గురువు క్రీస్తుని పోలినవాడవుతాడు. క్రీస్తురూపం అతనిలో నెలకొంటుంది. క్రీస్తు యాజకుడు, బోధకుడు, కాపరి. అనగా ప్రజలను పవిత్రపరచేవాడు, వారికి బోధ చేసేవాడు, వారిని పాలించేవాడు. ఈ త్రివిధ క్రీస్తు లక్షణాలు పై ముద్రద్వారా గురువుకికూడ సంక్రమిస్తాయి.

అసలు గురువులో మూడు ముద్రలుంటాయి. మొదట జ్ఞానస్నానంద్వారా అతనికి ఓ ముద్ర వస్తుంది. దీనిద్వారా అతడు ఇతర క్రైస్తవుల్లాగే తానూ క్రీస్తుతో ఐక్యమై క్రీస్తు బలిని అర్పించడానికి యోగ్యుడౌతాడు. ఇతర దేవద్రవ్యానుమానాలను పొందడానికిగూడ అర్హుడౌతాడు.

తర్వాత అతనికి భద్రమైన అభ్యంగనంద్వారా రెండవ ముద్రవస్తుంది. దీనిద్వారా అతడు ఇతర క్రైస్తవుల్లాగే తానూ క్రీస్తుకి సాక్ష్యం పలికేవాడవుతాడు. క్రీస్తుకోసం వేదసాక్షిగా మరణించేవాడుకూడ అవుతాడు.

కడన అతనికి గురుపట్టపుముద్ర వస్తుంది. దీనిద్వారా అతడు క్రీస్తు మధ్యవర్తిత్వంలో పాలు పొందుతాడు. ఆ క్రీస్తులాగే యాజకుడు, ప్రవక్త, కాపరి అనే త్రివిధాధికారాలను పొందుతాడు. క్రీస్తు గురుత్వంలో పాలుపొంది తానూ "అపరక్రిస్తు” గా మారిపోతాడు.

క్రీస్తు నిరంతరం తన్నుతాను తండ్రికి అర్పించుకొంటాడు. తనతోపాటు నరజాతి నంతటినీ తండ్రికి అర్పిస్తుంటాడు. ఇక గురువు, భూమిమిూద ఈ క్రీస్తు అర్పణాన్ని కొనసాగిస్తుంటాడు. తాను క్రీస్తు చేతిలో సాధనమాత్రుడుగా వుండి ప్రజలను క్రీస్తు పాస్క పరమ రహస్యంలోనికి ప్రవేశపెడుతుంటాడు. దివ్యసత్ర్పసాదబలి నర్పించడం ద్వారా అతడీకార్యాన్ని ప్రముఖంగా సాధిస్తాడు.