పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నడకతీరు, ముఖభంగిమలు, మాటలాడే వైఖరి యువకులను ఆకర్షిస్తాయి. తనలోని ఈ యాకర్షణను యువతి వెంటనే గుర్తిస్తుంది. గర్విస్తుందికూడ. కొందరు యువతులు ఈ యాకర్షణను యువకులమీద ప్రయోగించిచూడాలని కూడ కోరుకొంటూంటారు. కాని ఈ ప్రాయంలో ఆమెకు లైంగికవాంఛ అంతగా ఉండదు. ఇక యిదే ప్రాయంలో వున్నా కూడ యువతికున్నంత మానసిక పరిపక్వత యువకునికుండదు. వివాహాన్ని గూర్చికూడ అతడంతగా ఆలోచించడు. ఓ ఉద్యోగాన్ని నంపాదించాలని మాత్రం ఉవ్విళ్ళూరుతూంటాడు. కాని యువతికంటె యువకునికి లైంగికవాంఛ బలంగా వుంటుంది. అతనికి సత్వరంగా వివాహం చేసికోవాలి అనేకోరిక లేకపోయినా యువతిస్నేహం కోసమూ, ఆడపిల్లల అందచందాలను అవలోకించడం కోసమూ ఉవ్విళ్ళూరిపోతూంటాడు. ఇవి యువతీ యువకుల మనస్తత్వాలు. ప్రాయం వచేకొద్దీ ప్రకృతే యువతీయువకుల్లో ఈలాంటి మనస్తత్వాలను సృజించి వాళ్ళను బలంగా ఆకర్షిస్తూంటుంది. కనుక ఇక్కడ ఆశ్చర్యపడవలసిన విషయమేమీలేదు.

ఇక, యౌవనప్రాయంలోని మానసిక భావాలను అనుగుణంగా మన యువతీ యువకులు కొన్నిసద్భావాలను పెంపొందించుకోవాలి. యువకుడు యువతికూడ తనలాగే ఓ మానుషవ్యక్తి అనుకోవాలి. ఆమెపట్ల గౌరవంగా ప్రవర్తించాలి. ఆమెనెప్పడూ భోగ్యవస్తువుగా భావింపగూడదు. స్త్రీ పురుషులనే జట్టునకు తాను నాయకుడు కావాలి. తన బాధ్యత చాల గొప్పది. కనుక అతడు దుష్టవాంఛలకు పశు ప్రవృత్తికి లొంగిపోకూడదు. పురుషుని వద్దనుండి పరిచయాన్ని ఆదరాన్ని అంగీకారాన్ని అనురాగరాన్ని,అనురాగన్నకోరుకుంటుంది. అందుచే యువతి చనువుతో తనవద్దకు వసూన్నంతమాత్రాన, లైంగికవాంఛతోనే వస్తుంది అనుకోవడం చాల పొరపాటు. అసలు ఆ ప్రాయంలో యువకుల్లోవుండే లైంగికవాంఛ యువతుల్లో వుండదన్నాం. కనుక యువకుడు ఏదోవిధంగా బలవంతం చేస్తేనేతప్ప, యువతి లైంగిక చేష్టలకు సాధారణంగా సమ్మతించదు.

ఇక యువతి, యువకుడు తనపట్ల గౌరవంగా మెలగేలా చూచుకోవాలి. ఆ ప్రాయంలో ఉద్యోగంమీదనేగాని వివాహంమీద అతనికి దృష్టివుండదు. ఆ ఉద్యోగం దొరికిందాక అతడు ఆడపిల్లలతో కాస్త సరదాగా ఆడుకొంటూ వుండాలని కోరుకొంటాడు - అంతే! ప్రాయంలో కాకపోయినా మానసిక పరిపక్వతలో అతనికంటె ఆమె పెద్దది. తన ఈ పెద్దరికాన్ని యువతి గుర్తించాలి. గుర్తించి జాగ్రత్తగా మెలగాలి. యువకుని చనువూ స్నేహమూ లైంగిక చేష్టలకు దారితీయకుండా వుండేలా చూచుకునే బాధ్యత ప్రధానంగా ఆమెది. ఈ బాధ్యతను విస్మరించిందో యువతి పతనమై పోతుంది. భ్రష్టురాలై తీరుతుంది.