పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వివాహానికి ముందే లైంగిక క్రియకు సమ్మతించే యువతిని యువకుడు గౌరవంతో చూడడు. గాలితిరుగుళ్ల తిరిగే రకం, తేలిక మనిషి అనుకొని నిర్లక్ష్యం చేస్తాడు. ఆ పిమ్మట వివాహ ప్రస్తావన వచ్చినా అతడు ఆమెను పెండ్లి చేసికోడానికి ఇష్టపడడు - గుణవంతురాలైన మరో కన్యను వెదుకుతాడు. పైగా దుష్టచేష్టలవల్ల యువతి గర్భవతి ఐందో, లెక్కలేనన్ని చిక్కులు వస్తాయి. యువకుడు ఆమెను పరిణయమాడ్డానికి ఒప్పకోడు. ఒకవేళ, తనవలననే గర్భవతి ఐంది గదా అని జాలివలనగాని, నిర్బంధంవలనగాని ఆమెను పెండ్లాడిన దాంపత్యజీవితం సుఖవంతం గాబోదు. ఇక పైన నుడివినట్లు యువతి గర్భవతి కాకపోయినా తాను చాల బాధలకు గురౌతుంది. పురుషునికి లైంగికక్రియ అంత లోతైన అనుభవాన్ని కలిగించదు. అది అతనికి ఓ మామూలు పనిలాగే వుంటుంది. కాని స్త్రీకి అలా కాదు. లైంగికక్రియ ఆమెకు గాధమైన అనుభవాన్ని కలిగిస్తుంది. గొప్ప సంచలనాన్ని సంక్షోభాన్ని కూడ తెచ్చిపెడుతుంది. ఈ యనుభవాన్ని ఆమె ఇక విస్మరించలేదు. ఓ చిన్నముద్దు, ఓ తాత్కాలిక స్పర్శకూడ స్త్రీకి మరపునకు రాని మనోభావాలను తెచ్చిపెడతాయి, మగవాళ్ళకు ఇదేమీ వుండదు. తాను బిడ్డలతల్లి కాబోతుంది గనుక ప్రకృతే స్త్రీని ఈలా మృదుహృదయనుగా తయారుచేసింది. కనుక వివాహానికిముందే ఓ యువకునితో దుష్టచేష్టలు నడపిన యువతి, తరువాత తన దాంపత్యజీవితంలో పొందికను చూపలేదు. భర్తతో కాపురం జేసేటప్పడు పూర్వానుభవాలు ఆమెను వేధిస్తాయి, బాధిస్తాయి. ఓమారు ఆమె మానసిక ప్రవృత్తి స్పందించింది, కలుషితమైపోయింది. మళ్లా ఆమె తెప్పరిల్లుకోవడం కష్టం. ఈ కారణాల వలన వివాహానికి మందలి యువతీ యువకుల పరిచయాలు చాల నిర్మలంగా వుండాలి అన్నాం.

2. వివాహ నిర్ణయం

పూర్వకాలంలో తల్లిదండ్రులే వివాహాలు నిర్ణయించేవాళ్లు, ఐనా పూర్వులు వధూవరుల నుద్దేశించిగాక, కుటుంబాల నుద్దేశించే, అనగా కొన్ని కుటుంబాలు ఐక్యమై బలవడ్డంకోసం వివాహాలు నిర్ణయించుకున్నారు. కాని నేడు ఆ పద్ధతి మారిపోయింది. ఈనాడు తరచుగా యువతీయువకులే తమ వివాహాలు నిర్ణయించుకుంటున్నారు.

మామూలుగా వివాహాలను నాల్ల పద్ధతుల్లో నిర్ణయిస్తూ వుంటాడు. 1. బిడ్డలను సంప్రతించకుండా తల్లిదండ్రులే తమ కనుకూలమైన రీతిగా వధూవరులను నిర్ణయించడం. 2. బిడ్డలను సంప్రతించి వాళ్ళ యిష్టాల ప్రకారం తల్లిదండ్రులే వధూవరులను నిర్ణయించడం, 3. తల్లిదండ్రుల సమ్మతితో బిడ్డలు తామే వధూవరులను నిర్ణయించుకోవడం 4. తల్లిదండ్రులను సంప్రతించకుండా బిడ్డలు స్వయంగానే తమకిష్టమైన వాళ్ళతో వివాహం.