పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12. వివాహ ప్రయత్నాలు

ముందటి అధ్యాయంలో వివాహమాడబోయే యువతీ యువకులు పరస్పరం పెంపొందించుకోవలసిన భావాలను వివరించాం. ఈ యధ్యాయంలో వాళ్లు వివాహనికి ఎలా తయారుకావాలో తెలియజేయబడుతుంది. వివాహానికి ముందు యువతీయువకులకు పరస్పర పరిచయం వుంటే మంచిది. తాము వివాహమాడబోయే వ్యక్తిని పూర్ణస్వాతంత్ర్యంతో తామే ఎన్నుకోవడంగూడ అవసరం. వివాహానికి ముందు కొంత ఉపదేశంకూడ వుండాలి. కనుక యూ మూడంశాలను గూర్చి ఇచ్చట ముచ్చటిద్దాం. నేడు మన పెద్దలు దేశమంతటా వివాహ సలహా కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నారు. ఈ వివాహ సలహాలను మనసులో పెట్టుకునే ఈ యధ్యాయం తయారుచేసాం.

1. యువతీ యువకుల పరిచయాలు

మన ప్రాచీన భారతీయ సమాజంలో యువతీయువకుల పరిచయాలంటూ వుండేవిగావు. కాని నేడు పాశ్చాత్యభావాల వల్ల మన సమాజం చాలవరకు మారిపోయింది. విద్యా సంస్థల్లోనైతేనేం, వివిధ కార్యరంగాల్లోనైతేనేం మన యువతీ యువకులు కలసిపోవడం జరుగుతూంది. ఈ సమ్మేళనాన్ని మనం నివారించలేం. నివారించకూడదు గూడ. ఎందుకంటే ఈ పరిచయం భావిజీవితానికి చాల ఉపకరిస్తుంది. ఈ పరిచయంద్వారా యువతీయువకులు ఒకరినొకరు తెలిసికొని అర్థంచేసుకుంటారు, ఒకరినొకరు సానుభూతితో అంగీకరిస్తారు. నరుని మానసిక జీవితానికి ఇది చాలా అవసరం. కనుక నాయకత్వపు క్యాంపులు, సాంఘికసేవాశిబిరాలు, వినోదకార్యక్రమాలు మొదలైనవి ఏర్పాటుచేసి మన యువతీ యువకులకు పరస్పరం పరిచయం కలిగిస్తూ వుండాలి.

ఇక పెద్దలు జాగ్రత్తగా ఏర్పాటుచేసిన పరిచయ మార్గాలవల్లనైతేనేం, లేక తమంతట తామే పరిచయాలు పెంపొందించుకోవడంవల్లనైతేనేం మన యువతీయువకులు చాలమంది చనువుతో మెలుగుతూంటారు. కాని, ఈ చనువులు ఎంతవరకు పోవచ్చు? యువతీయువకులు పరిచయాలు, స్నేహాలు, భావి స్త్రీ పురుషులు కాబోయేవాళ్ళు ఒకరినొకరు అర్థం జేసికోవడానికి ఉద్దేశింపబడినవి గనుక చాల నిర్మలంగా వుండాలి. జంతుప్రవృత్తికి, దుష్టచేష్టలకు దారితీయకూడదు. ఇది చాల ముఖ్యమైన అంశం గనుక ఒకింత విపులంగా వివరించడం మంచిది.

మొదట యువతీ యువకుల మనోభావాలు పరిశీలిద్దాం. యువతి నిత్యం తన భావిజీవితాన్ని గూర్చి, విశేషంగా తన వివాహాన్ని గూర్చి ఆలోచిస్తూ వుంటుంది. ప్రాయం వచ్చేకొద్దీ ఆమెలో అందచందాలు, ఆకర్షణా గోచరిస్తాయి. ఆమె వస్త్రధారణ విధానం,