పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ప్రభు మార్గాలు యువతీయువకులు తల్లిదండ్రులపట్ల విధేయతను చూపుతూండాలి. తల్లిదండ్రులూ బిడ్డల కోర్మెలను మన్నిస్తూ వాళ్ళ కోపాన్ని రెచ్చగొట్టకుండా వుండాలి. చిన్ననాటినుండి బిడ్డలను ప్రభుమార్గంలో నడుపుతూ వుండాలి - ఎఫె 6,1-3. 4. ఈ దేహం :

  ఈ దేహం జ్ఞానస్నానం ద్వారా క్రీస్తుతో ఐక్యమౌతుంది
  ఈ దేహాన్ని ప్రభువు నెత్తురు బిందువులు చిందించి రక్షించాడు 
  ఈ దేహం ప్రభు దేహంతో పోషింపబడుతుంది. 
  ఈ దేహం పవిత్రాత్మకు ఆలయం 
  ఈ దేహం ఉత్తానమై మళ్ళా ప్రభు సన్నిధిలో నిలుస్తుంది. 
  ఈ దేహం ప్రభువుకోసం ఉద్దేశింపబడింది, ప్రభువుది. 
  ఈ దేహాన్ని- అది స్త్రీ దేహమైనాసరే పురుష దేహమైనాసరే - కామ దృష్టితోగాక పవిత్రదృష్టితో చూడాలి. 

5 పరస్త్రీలు భక్తులైన హైందవ కవులు పరస్త్రీలను మాతృదృష్టితో జూడమన్నారు. బమ్మెర పోతరాజుగారి ప్రహ్లాదుడు :

  "కన్నుదోయికి నన్యకాంత లడ్డంబైన 
  మాతృభావన సేసి మరలువాడు".

రావిపాటి త్రిపురాంతకుడనే పదునాల్గవశతాబ్ద కవి అంబికాదేవిని యిలా ప్రార్థించాడు.

 లాచి పరాంగనల్ వరవిలాస మనోహర విభ్రమంబులన్ 
 జూచిన జూడ డుత్తముడు, చూచిన జూచును మధ్యముండు, దా
 జూచిన చూడకుండినను జూచు కనిష్పడు;వీరిలోననన్
 జూచిన చూడకుండు గుణి జూచిన చూపన చూడు మంబికా!

6. ఉత్తమ దాంపత్యం ఉత్తమ రామచరితంలో భవభూతి ఉత్తమ దాంపత్యాన్ని ఈలా వర్ణించాడు : “ఉత్తమ దంపతులు సుఖ దుఃఖాలు సమంగా పంచుకుంటారు. కలిమిలోనూ, లేమిలోనూ ఇద్దరూ కలసే వుంటారు." (అద్వైతం సుఖదుఃఖయోః అనుగతం సర్వాసు అవస్థాసు).