పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెండ్లి చేసుకొనే యువతి యువకుని విషయంలో పెంపొందించుకోవాల్సిన ప్రధానభావాలు రెండు. 1. ఉత్తమ క్రైస్తవ స్త్రీ భర్తకు ముందుగా నడువదు. భర్తతో సరిసమానంగా ప్రక్కన నడుస్తుంది. కొన్నిసార్లు అణకువతో అతని వెనుకకూడ నడచిపోతూంటుంది. 2. కాని అతడు త్రోవతప్పినపుడెల్ల మెల్లగా పిలుస్తూంటుంది. మృదువుగా భుజాలు తట్టుతూంటుంది. అతడు మళ్ళా త్రోవలో నడిచేలా చేస్తూంటుంది. అతడు అధిపతి, ఆమె సహాయురాలు.

తొలి స్త్రీ ఏవ ఆదాము ఎదుట నిలిచింది. శ్రీసభ తన భర్త క్రీస్తు ఎదుట నిలిచింది. వీళ్ళకు పోలికగా వుండే క్రైస్తవ భార్యకూడ తన భర్త ఎదుట నిలుస్తుంది. అతడు ఆమెవైపు తేరిపారజూస్తాడు. ఆమెకూడ అతనివైపు కన్నులెత్తి చూస్తుంది. అతడు ముందు వెళ్తూటే అతని ప్రక్కన తాను పోతూంటుంది. వాళ్ళిద్దరి వెంటా బిడ్డలు సాగిపోతారు. ఇది మానవుల మహాయాత్ర.

ప్రార్థనా భావాలు

1. ఈసాకు - రిబ్కా

అబ్రాహాము కొడుకు ఈసాకు. ఇతనికి వధువును వెదకడంకోసం అబ్రాహాము సేవకుడు యజమానుని జన్మదేశానికి వెళ్తాడు. ఆ దేశంలో తనకు ఎదురుపడే బాలికయే ఈసాకునకు భార్య కావాలని ప్రార్ధిస్తాడు. అతడు కోరినట్లే రిబ్కా అనే బాలిక బావియొద్ద యెదురుపడి సేవకునకు అంతని యొంటెలకు నీళ్ళు తోడియిస్తుంది. తరువాత ఈసాకు, రిబ్కాలకు వివాహం జరిగిపోతుంది. ఈ రీతినే మన వివాహాలు కూడ కొంతవరకు దైవనిర్జీతాలు. ప్రభువు మనకోసం ఉద్దేశించిన యువతి లేక యువకుడు ఎక్కడో పెరుగుతూనే వుండాలి - ఆది 24,42-44.

2. మీకాలు - రాహేల

ఒకోమారు యువతీయువకులు తమకిష్టం వచ్చినవారిని పెండ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటారు. కాని ఈ నిర్ణయం తల్లిదండ్రులకు సరిపడదు. ఐనను ప్రత్యక్షదోషముంటేనే తప్ప బిడ్డల నిర్ణయాన్ని తల్లిదండ్రులు కాదనకూడదు. సౌలు కుమార్తె మీకాలు దావీదును ప్రేమించి అతనిని వివాహం చేసికోగోరింది. దావీదంటే సౌలునకు గిట్టదు. ఐనా అతడు ఈ వివాహాన్ని కాదనలేదు -1సమూ 18,20. యాకోబు రాహేలును ప్రేమించి ఆమెకోసం ఏడేండ్లు లాబానుకు సేవలుచేసాడు. లాబాను తొలుత ఇష్టపడలేదు. " ఐనా తర్వాత వాళ్ళ వివాహం యధావిధిగా సాగిపోయింది-ఆది 29,15-20