పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్యగాగూడా తన ఆశయాన్ని సాధించుకుంటుంది. వివాహిత భర్తనేలా సంతోషపెట్టాలా అనే రేయింబవళ్లు భర్త విషయాలతో సతమతమౌతూ వుంటుంది. కాని అవివాహితయైన మఠకన్య ప్రభువునేలా సంతోషపెట్టాలా అని అహోరాత్రులు ప్రభు విషయాలతో సతమతమౌతూ వుంటుంది. ఈలా కన్యాజీవితం ద్వారా గూడ స్తీ ధన్యురాలు ఔతుంది-1కొ 7,34. ఈలాంటి ఉత్తమ స్త్రీ మరియమాత. ఆమె యందు స్త్రీ ధర్మాలన్నీ కార్యసిద్ధినందాయి. స్త్రీ భార్యగా మాతగా మాత్రమేగాక, కన్యగాకూడ ధన్యురాలు ఔతుంది అన్నాం. అలాగే పురుషుడూ తండ్రిగా భర్తగా మాత్రమేగాక, అవివాహితుడుగాగూడ ధన్యుడౌతాడు. కాని ఈ యవివాహితత్వం ప్రభువుకోసం ; ప్రభు సామ్రాజ్య వ్యాప్తికోసం, ప్రభువు పునీత ప్రజల్ని పీఠం చుటూ సమావేశపరచి దివ్యభోజనంతో పోషించడంకోసం. అనగా అతడు ప్రభుస్థానే నిలచే గురువు - మత్త 19,12; 1కొ 7,32-33.

6.సవరింపులు

యువతినిగూర్చి యువకులదృష్టి రెండు విపరీతమార్గాల పోవచ్చు. 1. స్వర్గలోకంలోంచి ఊడిపడిందో అన్నట్లు ఆమెను ఓ దేవతలా భావించడం, లేనిపోని గొప్పలు, వట్టి ఆశయాలు ఆమెకు అంటగట్టటడం. ఇది కవులు మొదలయిన కళాకారులు చేసేపని. ఇలాంటి భావాలుగల యువకులు కొద్దిరోజుల్లోనే నిజం తెలుసుకుని నిరుత్సాహపడతారు. 2. మరికొంతమంది యువకులు ఆమెను జంతు దృష్టితో చూస్తారు. తమలోని కామప్రవృత్తికి ఆమెను బలివస్తువుగా వాడుకోగోరుతారు. ఈలాంటివాళ్ళకూడా అచిరకాలంలోనే అపజయాన్ని పొందుతారు.

పెండ్లి చేసుకునే యువకుడు యువతి విషయంలో యథార్థంగా పెంపొందించు కోవాల్సిన భావాలు రెండు. 1. ఆమె తనకు సహాయురాలు ; స్నేహితురాలు ; సహచారిణి. 2. అతడు తన బిడ్డలకు తండ్రియైనట్లే, ఆమెకూడ బిడ్డలకు తల్లి.

ఇక యువకుని విషయంలో యువతుల దృష్టికూడ రెండు విపరీత మార్గాల పోవచ్చు. 1. అతనికి పూర్తిగా వశపడిపోయి ఓ బానిసలా ప్రవర్తించడం. అతడు చేసే మంచిపనికీ, చెడు పనికీ సమ్మతిస్తూ వుండడం. అతడే పతి, గతి, దేవుడు అని స్తుతిస్తూ వుండటం. ఈలాంటి ప్రతివ్రతలు వ్యక్తిత్వం లేనివాళ్లు ఈలాంటి పాతివ్రత్యాన్ని బైబులు ఆమోదించదు. అదృష్టవశాత్తు నేటి స్త్రీలలో ఈలాంటి వెన్నెముకలేని పతివ్రతలు తక్కువమంది. 2 మాటిమాటికి అతనితో పోటీపడ్డం. నీవు ఎక్కువేమిటి, నేను తక్కువేమిటి అనడం. నేనూ నీయంతటిదాన్ని సుమా అన్నట్లు ప్రవర్తించడం. ఈలాంటి స్త్రీ భర్త జీవితాన్ని దుఃఖంపాలు చేస్తుంది. అతని హృదయాన్ని వ్యధతో నింపివేస్తుంది.