పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనమందరమూ పితకు బిడ్డలం, క్రీస్తుకు సోదరసోదరీ జనులం. క్రీస్తు ఏర్పరచిన శ్రీసభలో సభ్యులం. ఇక, దేహంలోని అవయవాల నన్నింటినీ ఆత్మ ఒక్కటిగా బంధిస్తుంది. ఈ ఆత్మ దేహాన్ని విడిచిపోయినపుడు నరుడు మరణిస్తాడు. దేహంలోని అంగాలు కూడ శిథిలమై పోతాయి. ఇక అవి ఒక్కటిగా పని చేయవు. ఇక, శ్రీసభ అనే జ్ఞానదేహాన్ని ఒక్కటిగా బంధించేదీ దానిలోని అవయవాలైన వివిధ ప్రజలకు ఐకమత్యం చేకూర్చేదీ పవిత్రాత్మ "దివ్యభోజనంలాగే దివ్యాత్మకూడ విశ్వాసులకు ఐక్యత చేకూరుస్తుంది" అన్నాడు సిరిల్ భక్తుడు.

నూత్నవేద ప్రజలమైన మనం క్రీస్తుద్వారా గాని తండ్రి దగ్గరకు వెళ్లలేం. కాని శ్రీసభ ద్వారాగాని క్రీస్తు దగ్గరికి వెళ్లలేం. దేవుడు శ్రీసభను రక్షణ మార్గంగా నిర్ణయించాడు. కావుననే సిప్రియస్ "దేవుణ్ణి తండ్రిగా బొందాలంటే మున్ముందుగా శ్రీసభను తల్లిగా బొందాలి" అని చెప్పాడు, మరియు మాత క్రీస్తును ఉదరంలో భరించింది. ఆ ప్రభువుకి పుట్టువు నిచ్చింది. అలాగే శ్రీసభకూడ మనలను తన ఉదరంలో భరించింది. మనకు జ్ఞానస్నానపు పుట్టువు నిచ్చింది. ప్రభువు మరియమాతను ఎంత ప్రేమభావంతో చూచాడో మనమూ శ్రీసభను అంత ప్రేమభావంతో చూడాలి. ఆ తల్లి అందించే వరప్రసాదాలను ప్రేమ గౌరవాలతో స్వీకరించాలి.

ప్రార్ధనా భావాలు

1. యావే ప్రభువు మోషే ముందుగా సాగిపోతూ తన్ను గూర్చి తాను ఈలా ప్రకటించుకొన్నాడు. "ప్రభువు! ప్రభువు! అతడు కరుణామయుడూ దయాపరుడూ ఐన దేవుడు. అతడు సులభంగా కోపపడేవాడు కాదు. నిత్యం ప్రేమ జూపేవాడు. నమ్మదగినవాడు. వేలకొలది ప్రజలను కృపతో జూచేవాడు. మన దోషాలను అపరాధాలనూ పాపాలనూ మన్నించేవాడు" - నిర్గ 34, 6–7. మనం వరప్రసాదాన్ని గూర్చి చెప్పే ముఖ్య భావాలన్నీ ఈ వేదవాక్యాల్లో ఇమిడి వున్నాయి. కనుక భక్తుడు ఈ వాక్యాలను జాగ్రత్తగా మననం చేసికోవాలి.

2. బైబులు భావాల ప్రకారం దేవుని వరప్రసాదాన్ని పొందడమంటే అతని దీవెన పొందడమే. పూర్వవేదంలో యాజకులు ప్రజలను దీవించేపుడు "ప్రభువు మిమ్మ దీవించి కాపాడునుగాక. మిమ్మ కరుణించి ఆదరంతో జూచునుగాక. మిమ్మ కృపతో జూచి మీకు సమాధానం దయచేయునుగాక" అని పలికేవాళ్లు - సంఖ్యా 6,24–26. దేవుని వరప్రసాదాన్ని పొందినపుడు మనం ఈ దీవెనలన్నిటినీ స్వీకరిస్తాం.