పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2.జ్ఞానదేహపు బాధ్యతలు

క్రీస్తునందు ఒక్కటిగా ఐక్యమైన ప్రజలు జాతిభేదాన్ని పాటించకూడదు. పౌలు క్రైస్తవుల్లో యూదులు, గ్రీకులు రోమనులు ఉన్నారు. ఐనా వీళ్ళంతా క్రీస్తుతో ఐక్యమైన ప్రజలు గనుక వీళ్ళల్లో వీళ్ళ జాతిభేదాలు పాటించకూడదు - కొలో 3,11. నేడు కులభేదాలనూ, వర్గభేదాలనూ వదలివేయలేక సతమతమౌతున్న భారతీయ క్రైస్తవులు పౌలుబోధలను స్మరించుకోవడం మేలు.

ఈ రీతినే క్రీస్తులోనికి ఐక్యమైన ప్రజలు లింగభేదాన్నీ పాటించరాదు - గల 3, 28. స్త్రీలను ఓ ప్రత్యేక జాతిగా భావించి కేటాయిస్తూ వుండడం నూతవేద బోధలకు విరుద్ధం. దేహంలోని అవయవాల్లాగే క్రీస్తుతో ఐక్యమైన ప్రజలూ ఒద్దికగా, కలుపుగోలుతనంతో జీవిస్తూండాలి. క్రైస్తవుల మధ్య కలహాలు పనికిరావు. జగడాలు కలిగించి విశ్వాసులను ఒకరినుండి ఒకరిని వేరుపరచే ప్రయత్నం తలపెట్టరాదు - 1కొ 1, 13.

విశ్వాసులు ఒకరికొకరు దురాదర్శం జూపి పాపకారణం కాకూడదు. మన పాడు పనులను జూచి ఇతరులు కూడ పాడుపనులు చేసేలా వుండకూడదు. ఈ బలహీనప నరులకోసం కూడ క్రీస్తు సిలువమీద చనిపోయాడు - 1కొ 8,11 క్రైస్తవ ప్రజలు ఒకరితో మరొకరు సత్యాన్నేగాని అసత్యాన్ని వచింపగూడదు - 2 కొ1, 19-20. అబద్ధపు మాటలు ప్రాత జీవితానికి, సత్యభాషణాలు క్రొత్తజీవితానికి చెందినవి. కొలో 8, 9-11.

3. వరప్రసాదాలన్నీ శ్రీసభ నుండే

క్రీస్తు ఆర్ధించిన వరప్రసాదాలు అతని జ్ఞానశరీరమైన శ్రీసభ ద్వారా గాని విశ్వాసులకు లభింపవు. నూత్నవేద ప్రజల రక్షణకై ప్రభువు ఏర్పరచిన మార్గం శ్రీసభ. క్రీస్తు వరప్రసాదాలు శ్రీసభ ద్వారా సభ్యులకు చేరడం మాత్రమేకాదు. ఈ సభ్యులనుకూడ శ్రీసభతో జోడిస్తాయి. ఈ రీతిగా శ్రీసభతో ఐక్యం గావడం ద్వారా సభ్యుల వరప్రసాదాలు కూడ ఒకరి వొకరికి ఉపకరిస్తాయి. ఈ కారణం చేత క్రైస్తవ సమాజంలో రక్షణం వ్యక్తిగతంకాదు, సాంఘికం. "ఎవరికి వారే యమునా తీరే" అనే భావం క్రీస్తుతో ఒక్క దేహంగా ఐక్యమైన క్రైస్తవ ప్రజలకు చెల్లదు. మన మందరమూ క్రీస్తు నందు ఒక్క సమాజంగా ఐక్యమయ్యాం గనుక సుఖదుఃఖాల్లోను ఒకరినొకరం భరించుకొంటూండాలి.