పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5. సౌలు దుష్టుడైపోగా యావే దావీదు నెన్నుకొన్నాడు.ప్రభువు సౌలును విడనాడి దావీదుకు తోడ్పడ్డం మొదలెట్టాడు.దానితో సౌలు ముసలిచెట్టులాగ క్షయించి పోయాడు.దావీదు లేతమొక్కలాగ ఏపుగా ఎదిగిపోయాడు.యావే తోడ్పాటువలన దావీదు పట్టిందల్లా బంగారమైంది.అతడు ఎక్కడికెళ్లినా విజయమే సిద్ధించింది -1 సమూ 18,12-16,

6. మోషే తరువాత యోషువా యిస్రాయేలు ప్రజలకు నాయకుడయ్యాడు. కాని ప్రజలను ఏలా నడిపించుకొని పోవాలో అతనికి తెలిసిందిగాదు. అప్పడు ప్రభువు యోషువాతో "నీవు నా యాజ్ఞల ప్రకారం జీవించినట్లయితే నేను నీకు తోడ్పడతాను. నీవు చేసే పనులన్నిటిలోను నీకు తోడైయుంటాను" అని అభయమిచ్చాడు. యావే చెప్పినట్లు యోషువా తరువాత ప్రభుదీవెన పొందాడు - యోషు 1, 8–9.

7. పిశాచం యోబుని నానా కష్టాలపాలు చేసింది. అతని సిరిసంపదలనూ బంధువులనూ ఆరోగ్యాన్నీ మనశ్శాంతినీ గూడ అపహరించింది. అయినా యోబు ప్రభు భక్తిపరాయణుడై ధైర్యంతో నిలిచాడు. ఇక పరీక్ష అయిపోయింది. ప్రభువు యోబుకి సాక్షాత్కారమై అతన్ని దీవించాడు. యోబు మళ్ళా సిరిసంపదలతో అలరాలాడు. అతనికి సంతానం కలిగింది. — యోబు 42, 12.

8. ఓమారు కొందరు తల్లలు చిన్నబిడ్డలను క్రీస్తు వద్దకు తీసికొనివచ్చి వాళ్ళను దీవించమని కోరారు. ప్రభువు పరలోక రాజ్యం ఈలాంటివాళ్లదే అంటూ ఆ బిడ్డలమీద చేతులుచాచి వాళ్లను దీవించాడు. — మత్త 19,15.

9. ప్రభువు మోక్షారోహణమయ్యే గడియ వచ్చింది.అతడు శిష్యులతో బెతానియావరకు వెడలిపోయి అక్కడ చేతులెత్తివారిని ఆశీర్వదించాడు.అలా ఆశీర్వదిస్తూ అతడు పరలోకాని కెక్కిపోయాడు.శిష్యులు ఆయనకు మొక్కి ఆనందంతో యెరూషలేముకు తిరిగి వచ్చారు. - లూకా 24, 50.

10.1) నీ లోగిట నీ భార్య పండ్లపండిన
ద్రాక్షతీగలా ఉంటుంది
నీ బిడ్డలు ఓలివు మొక్కల్లా ఎదుగుతారు
ప్రభువుపట్ల భయభక్తులతో మెలిగేవాళ్ళకు
ఈలాంటి దీవెనలు లభిస్తాయి - కీర్త 128, 3-4.
2) నేను చీకటిలోయగుండా పయనించినా
ఏ యపాయానికీ జంకను
నీవు నాకు తోడై యుంటావు
నీ చేతికర్రా, నీ కోలా
 నన్ను కాపాడుతూంటాయి - కీర్త 23, 4.