పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7.మనం ప్రార్ధనం చేసేపుడు తోడివాళ్ళమీద ఏమైనా మనస్పర్ధ వున్నట్లయితే వాళ్లను క్షమించాలి. మనం తోడి జనులను క్షమించకపోతే దేవుడు మనలను క్షమించడు.- మార్కు 11,25.

24. ప్రభుదీవెన

భక్తుడు భగవంతుని అనుగ్రహానికి నోచుకొంటాడు. ప్రభువు అతన్ని దీవిస్తాడు. దానితో అతడు మూడు పూవులూ ఆరు కాయలుగా పెంపజెందుతాడు. ఇక నరులు కలిగించే ఆటంకాలేమి అతనికి అడ్డురావు. దైవబలం కలవాళ్ళు పక్షిరాజులాగ పైకెగిరి పోతూంటారు.

1.అబ్రాహాము మహాభక్తుడు. ప్రభువుని నమ్మి సొంత దేశమైన కాల్టియాను వదలివచ్చినవాడు. కనుక ప్రభువు అతన్ని దీవించాడు. అతని సంతానం ఇసుకరేణువుల్లాగ, ఆకాశంలోని చుక్కల్లాగ లెక్కల కందనిరీతిగా విస్తరిల్లుతుందని చెప్పాడు. అతనిపేరు అబ్రామునుండి అబ్రాహామునకు మార్చాడు. అబ్రాహాము అంటే అనేక జాతులవాళ్లకు తండ్రి అని అర్థం. అనగా అబ్రాహాము సంతానం తామరతంపరగా వృద్ధి జెందుతుందని భావం, ప్రభువు ఆ భక్తుని కిచ్చిన దీవెన ఆలాంటిది.- ఆది 17, 5-6.

2.అబ్రాహాము కుమారుడు ఈసాకుగూడ ప్రభుభక్తుడు. కనుక దేవుడు ఈసాకుని దీవింపగా, అతడు వెదవెట్టిందే తడవుగా నూరంతల పంట చేతికివచ్చింది.అతని గొర్రెలమందలు గొడ్లమందలు వృద్ధిలోకి వచ్చాయి. అతని బానిసలు ఆ మందలన్నిటినీ కాస్తూవచ్చారు. ఈసాకు రోజు రోజుకి అభివృద్ధిచెంది మహా సంపన్నుడయ్యాడు.అతని వృద్ధిని చూడగా చుట్టుపట్లవున్న ఫిలిస్టీయులకు పండ్లు పలిసాయి.- ఆది 26, 12-14.

3.యోసేపును చాలమంది అణగద్రోక్కాలని చూచారు.కనానులో అతని అన్నలే అతన్ని పైకిరానీయలేదు. ఐగుపులో పోతీఫరు భార్య అతన్ని నాశం జేయజూచింది. అయినా దేవుడు ఆ భక్తునికి తోడుగా వున్నాడు. అతన్ని దీవించాడు. కావుననే యోసేపు శుక్లపక్షంనాటి చంద్రబింబంలాగ వర్ధిల్లుతూ వచ్చాడు. దేవుడు మేలు చేయగోరినవాడికి ఎవడు చెరుపచేయగలడు? - ఆది 39,2.

4.యూదులకు మందసం పరమ పవిత్రమైంది. దానిలో ప్రభువు మోషేకిచ్చిన పదియాజ్ఞల పలకలుండేవి. దానిమీద ప్రభుసాన్నిధ్యముండేది. దావీదు ఈమందసాన్ని మూడు నెలలపాటు గితీయుడైన ఓబెదెదోమ యింటిలో ఉంచాడు. మందసము కారణంగా ప్రభువు ఓబెదెదోమును చల్లనిచూపు చూచాడు - 2 సమూ 6,12.