పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొడుకులిద్దరు చనిపోగా సొంత దేశానికి తిరిగిరావాలనుకొంది. కనుక కోడండ్లను పుట్టిండ్లకు వెళ్ళిపొమ్మని చెప్పింది. పెద్దకోడలు ఓర్చా కన్నవారింటికి వెళ్లిపోయింది. కాని చిన్నకోడలైన రూతు మాత్రం “నేనుగూడ నీ వెంటనే వస్తాను. నీ బంధువులే నాకు బంధువు లౌతారు. నీ దేవుడే నాకు దేవుడౌతాడు. నీవు చనిపోయేకాడనే నేనూ చనిపోతాను. మరణం వరకూ మన మిద్దరం విడిపోగూడదు” అంది. నవోమి కోడలిబుద్ధికి మెచ్చుకొని ఆమెనుగూడ వెంటబెట్టుకొని యిస్రాయేలు దేశానికి వచ్చింది. పూర్వం యూదస్త్రీలు సంతానం కలుగకముందే భర్త చనిపోయినట్లయితే ఆ భర్తకు దగ్గరి చుట్టమైన పురుషుని గూడి సంతానం పొందేవాళ్లు. ఆ యాచారాన్నే దేవరన్యాయం అనేవాళ్లు.ఆ యాచారం ప్రకారమే రూతు నవోమికి దగ్గరి బంధువయిన బోవసువలన బిడ్డనుగని తన జీవితం ధన్యం చేసికొంది - రూతు 1, 16-17.

5. హిజియారాజు యావే భక్తుడు. అతడు ప్రభువు మీదనే మనసు నిల్పి ప్రభువు ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవాడు. ప్రభువు హిజియాకు తోడ్పడినందున అతడు ఎక్కడికి వెళ్ళినా ఏమిచేసినా విజయం లభిస్తూండేది. ఈలా ఉండగా అస్సిరియా రాజైన సనెర్రీబు యూదామీది కెత్తివచ్చాడు. హిజ్కియాను భయపెడుతూ కమ్మవ్రాసి పంపాడు. "ఓయి హిజ్కియా! నన్నెదిరించిన రాజులందరూ మంటగలిసిపోయారు. ఆ రాజులు కొలిచే దేవతలు వాళ్లను నా దాడినుండి కాపాడలేకపోయారు. నీకూ అదేగతి పడుతుంది. కాని నీవు నా శరణుజొచ్చావో, బ్రతికిపోతావు" అని కబురు పంపించాడు హిజ్కియా ఆ జాబును తీసికొనివెళ్లి ప్రభువు దేవాలయంలో పీఠంమీద విప్పిపెట్టాడు. కొయ్యబొమ్మలనూ రాతి బొమ్మలనూ కొలుచుకొనే రాజులను సనెర్రీబు జయిస్తే జయించవచ్చు గాక, యావేను కొలిచే రాజును మాత్రం ఆతడు జయించకుండా ఉండేలా చేయమని ప్రార్ధించాడు. యావే ఆ భక్తుని ప్రార్థన ఆలించాడు. ఆ రాత్రి ప్రభువదూత వెళ్లి సనైర్రీబు సైన్యంలో కొందరిని చంపివేయగా అతడు భయపడి వెనుదిరిగి పారిపోయాడు - 2 రాజు 19, 14-19.

6. ఇత్తాయి దావీదు అంగరక్షకులకు నాయకుడు. అతడు యూదుడుకాడు, అన్యజాతివాడు. దావీదు కొలువులో చేరి అతనికి ఊడిగం చేస్తున్నాడు. ఓ మారు దావీదు అబ్సాలోమునకు వెరచి యెరూషలేమునుండి పారిపోతున్నాడు. అపుడు యిత్తాయిగూడ దావీదువెంట ప్రవాసానికి బయలుదేరాడు. దావీదు అతన్ని తనవెంట రావద్దని వారించాడు. తన మీద యిక ఆశవదలుకొమ్మనీ, అబాలోము కొలువులోచేరి అతనికి ఊడిగంచేయమనీ సలహా యిచ్చాడు. కాని స్వామిభక్తిగల యిత్తాయి “యావేతోడు. చావుగానీ బ్రతుకుగానీ రాజెక్కడ ఉంటాడో ఈ దాసుడు గూడ అక్కడే ఉంటాడు" అని పలికి తానూ దావీదువెంట వెళ్లిపోయాడు - 2 సమూ 15, 20-21.