పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2. తిరుసభ లోకంలో పులిపిడి ద్రవ్యంగా వుండాలి. క్రీస్తే ఈ వుపమానాన్ని చెప్పాడు - మత్త 13, 33. పులిపిడి ద్రవ్యం చిన్నదే. కాని అది పిండి అంతా పొంగేలా చేస్తుంది. లోపలినుండి దాన్నినెమ్మదిగా మార్చివేసి అది రొట్టెగా మారడానికి సిద్ధమయ్యేలా చేస్తుంది. తిరుసభఏదో రహస్య సమాజంలాగ ఈ పని చేయదు. ప్రేమతో, తనకున్నది ఇతరులతో పంచుకోవడం ద్వారా, ఈ కార్యాన్ని సాధిస్తుంది. ఆత్మే తిరుసభ ద్వారా లోకంలో ఈ మార్పు తెస్తుంది. తిరుసభకు ఏనాడు సంఖ్యాబలం వుండదు. అది చాల చిన్నది. లోకం పెద్దది. భారత దే్శం క్రైస్తవ సమాజం ఎప్పడూ చిన్నదిగానే వుంటుంది. కాని ఈ చిన్న సమాజమే ఈ పెద్ద దేశాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ కార్యం ఆత్మద్వారా జరుగుతుంది. కనుక క్రైస్తవ సంఘం ఎప్పడూ లోకం వైపు దృష్టిత్రిప్పి వుంచాలి. ఎప్పడూ లోకంతో కలసి పనిజేస్తుండాలి.

-3. తిరుసభ లోకంతో సంప్రతింపులు జరపాలి. లోకంలో ఇన్ని మతాలు, భావాలు, దృక్పథాలు వున్నాయి. మన భారతదేశంలోనే ఎన్ని మతాలు లేవు? కాని వీటన్నిటిలోను కొన్ని ఐక్యతా భావాలు వుంటాయి. వీటిని ఆధారంగా జేసికొని తిరుసభ అన్యమతాలతో సంప్రదింపులు, సంభాషణలు జరపాలి. మొదట మతాల్లోని ఏ భావాలు నరులందరూ ఐక్యం గావడానికి దోహదం చేస్తాయో వాటిని గ్రహించాలి. మతాల్లో మనుష్యులను విభజించే భావాలుకూడ వుంటాయి. వాటి విషయం తర్వాత పరిశీలించవచ్చు. మన సంప్రదింపుల ద్వారా ఇతర మతాల్లో ఏలాంటి మార్పు వస్తుందో మనకు తెలియదు. మన తరపున మనం నరులను ఐక్యంజేసి వారిలో సఖ్యసంబంధాలు పెంపొందించాలి. ఇదే దైవరాజ్యం. సంప్రదింపులూ సంభాషణలూ పలు వర్గాల ప్రజలతో జరపాలి. ఇతర క్రైస్తవ సంఘాలతో, అన్యమతాలతోగూడ సంభాషణలు జరపాలి. ఇవి విశ్వాస పరిధిలో, భావాల పరిధిలో, జీవిత పరిధిలో, క్రియల పరిధిలో నానా రూపాల్లో వుంటాయి. పవిత్రాత్మ ప్రేరణంవల్ల నరుల హృదయాలు క్రమేణ మారతాయి.
4. తిరుసభ పేదలను ఆదుకోవాలి. నరుని స్వార్థం, పాపం లోకాన్ని నాశం చేస్తాయి. ధనవంతులు బలవంతులు బడుగు వర్గాల వారిని అణగదొక్కారు. కొద్దిమంది సుఖాలకు నోచుకుంటే అధిక సంఖ్యాకులు కష్టాలపాలయ్యారు. క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినపుడు తాను పేదల కొరకు వచ్చానని చెప్పకొన్నాడు. పీడితులకు విమోచనాన్నీ హితవత్సరాన్నీ తీసుకొని రావడానికి వచ్చానని పల్మాడు - లూకా 4,18-19. క్రీస్తులాగే తిరుసభకూడ పేదలకు సహాయం చేయాలి.మనం ప్రతి విచారణలోను పేదరికాన్ని పరపీడనాన్ని గుర్తించాలి. ప్రజల పేదరికాన్ని తొలగించడానికి విశ్వప్రయత్నాలు చేయాలి.