పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. క్రైస్తవులు క్రైస్తవేతరుల్లో కూడ ఆత్మ పనిచేస్తుంటుందని గ్రహించాలి. ఆత్మ వరాలను క్రైస్తవులు మాత్రమే గుత్తకు తీసుకోలేదు. అన్యమతాలనూ ఆ మతాల్లోని వక్తలనూ కూడ ఆత్మడు తన పనికి వినియోగించుకొంటూంటాడు. వాళ్ళు కూడ దేవుని రక్షణాన్ని ప్రజలకు అందిస్తుంటారు. ప్రజల శ్రేయస్సు కొరకు పనిజేసేవాళ్ళ హృదయాల్లో, లోకకళ్యాణంకొరకు ప్రాణాలర్పించేవాళ్ళ మనస్సుల్లో ఆత్మడు తప్పక వుంటాడు. మనం ఈలాంటి వాళ్ళను గుర్తుపట్టి వాళ్ళతో కలసి పనిచేయడానికి పూనుకోవాలి. మంచి అంతా మనమే చేయనక్కరలేదు.

4. మన జీవితానికీ పనికీ గూడ దైవానుభూతి ముఖ్యం. కాని నేటి క్రైస్తవుల్లో ఈ దివ్యానుభూతి చాల తక్కువగా కన్పిస్తుంది. ఈ యనుభూతి లోపించినపుడు మనం čśróo, స్నేహితులు, బంధువులు, పలుకుబడి మొదలైన వాటిపై ఆధారపడతాం, కాని వీటితో దైవరాజ్యాన్ని స్థాపించలేం. ఆత్మ వీటి ద్వారా పని చేయదు. భారతదేశ క్రైస్తవులు ఆత్మనూ ఆ యాత్మబోధించే క్రీస్తునీ గాఢంగా అనుభవానికి తెచ్చుకోవాలి. అప్పడుగాని మనం సువిశేష సేవలో ఎదురయ్యే ఆటంకాలను ఎదుర్కొనలేం. దైవానుభూతి మనం ప్రప్రథమంగా సాధించవలసిన కార్యం.

4. ప్రపంచంతో కలసిపోయే తిరుసభ

క్రీస్తులాగే తిరుసభకూడ ఈ లోకంతో కలసిపోవాలి. క్రీస్తు సిలువమీద చేతులు చాచి ప్రపంచాన్నంతటినీ ఆలింగనం చేసికొన్నాడు. దాన్నితండ్రికి అర్పించాడు. శ్రీసభకూడ ఈలాగే చేయాలి.

1. క్రీస్తు తన పరిచర్య ప్రారంభించక ముందు యోహాను నుండి జ్ఞానస్నానం పొందాడు. ఈ క్రియద్వారా అతడు పాపపు లోకానికి చెందినవాడయ్యాడు. మన పాపాలలో పాలు పంచుకొన్నాడు -2 కొరి 5,21. దీని ద్వారా అతడు లోకం పాపాలను పరిహరించే గొర్రెపిల్ల కాగలిగాడు - యోహా 1,29. క్రీస్తు సాన్నిధ్యం కలిగిన తిరుసభకూడ ఈలాగే చేయాలి. అనగా అది లోకంలోని నరులందరితోను సఖ్యసంబంధాలు పెంచుకోవాలి. లోకంలోని నరుల సమస్యలు దాని సమస్యలు కావాలి. అది తన లాభాన్ని తాను చూచుకోకూడదు. ప్రపంచ ప్రజల లాభాన్ని లెక్కలోకి తీసికోవాలి. తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించి దాని రక్షణం కొరకు తనకు ప్రీతిపాత్రుడైన ఏకైక కుమారుడ్డిసిలువ మరణానికి అప్పగించాడు- యోహా 3, 16. లోకం ఒకవైపు పాపంతో నిండి వుంటుంది. ఈ లోకానికి మనం దూరంగా వుండాలి. కాని క్రీస్తు రక్షణం కూడ ఈ లోకంమీద సోకుతూంటుంది. ఈ లోకానికి మనం దగ్గర కావాలి. అందుకే భక్తులంతా లోకంతో కలిసి పోయారు. లోకోద్ధరణకు కృషి చేసారు.