పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పేత్రు ఆధిపత్యాన్ని సూచించే ప్రధాన వాక్యాలు మత్తయి 16,17-19లో వున్నాయి. ఈ యాలోకనంతో పాటు లూకా 22,31-34, యోహాను 21, 15-17 కూడ ముఖ్యమైనవే, కాని యిక్కడ మనం మొదటి ఆలోకనాన్ని చూస్తేచాలు. అది యిది.

"16,17. యోనా కుమారుడవైన సీమోనూ! నీవు ధన్యుడివి. నీకు ఈ విషయాన్ని తెలియజేసింది పరలోకంలోని నా తండ్రేకాని, నీ సహజశక్తికాదు. 18. నీవు రాయివి (కేఫావి). ఈ రాతిమిూద నేను నా తిరుసభను నిర్మిస్తాను. మరణశక్తులు దాన్ని జయించలేవు. 19. నేను పరలోకరాజ్యపు తాళపుచెవులు నీకిస్తాను. భూలోకంలో నీవు దేనిని బంధిస్తావో అది పరలోకంలోను బంధింపబడుతుంది. భూలోకంలో నీవు దేనిని విప్పతావో అది పరలోకంలోను విప్పబడుతుంది."

1. మొదట పేత్రు పేరును పరిశీలిద్దాం. అతని పేరు సీమోను. క్రీస్తు ఆ పేరుని కేఫాగా మార్చాడు - యెహా 1,42. క్రీస్తు మాట్లాడిన అరమాయిక్ భాషలో కేఫా అంటే రాయి. ఈ కేఫా పదాన్నే నూత్నవేద రచయితలు గ్రీకు భాషలో "పేతోస్"గా అనువదించారు. క్రీస్తు పేత్రుతో "నీ పేరు రాయి (కేఫా). నేను ఈరాతిమిూద నా తిరుసభను నిర్మిస్తాను" అని చెప్పాడు - 16,18. కనుక క్రీస్తు స్థాపించబోయే తిరుసభకు పేత్రు పునాదిరాయి. అనగా ముఖ్యనాయకుడు.

అరమాయిక్ భాషలో కేఫా అంటే రాయి అని చెప్పాం. కాని ఈ పదాన్ని ఆ భాషలో మనుష్యులు పేరుగా వాడేవాళ్లుకాదు. క్రీస్తే మొదటిసారిగా దాన్ని ఓ మనిషిపేరుగా వాడాడు. ఎందుకు? అతని దృష్టిలో ఆ పేరుతో పిలువబడే సీమోనుకి ప్రత్యేక ప్రాముఖ్యముంది. అతనికి తిరుసభలో ప్రత్యేకమైన పదవి లభిస్తుంది.

క్రీస్తు నిర్మింపబోయే తిరుసభ పూర్వవేద సమాజానికి బదులుగా వచ్చే నూత్న సమాజం. ఈ సమాజాన్ని క్రీస్తు ఓ భవనంలా కడతాడు. ఈ భవనానికి పేత్రు పునాదిరాయి ఔతాడు. దేవుడు అబ్రాహామనే పునాది రాతిమిూద ఈ లోకాన్ని నిర్మించాడనీ, పండ్రెండుమంది పితరులనే పునాది రాతిమిూద యిస్రాయేలు అనే భవనాన్ని నిర్మించాడనీ పూర్వవేద రబ్బయిలు వాకొన్నారు. ఈ పలుకుబళ్ళను ఆధారంగా జేసికొనే క్రీస్తు, పేత్రు నూత్న సమాజానికి మూలరాయి అని అన్నాడు.

పైగా పేత్రుకి శిష్యుల్లో అతి ప్రముఖస్థానం వుంది. పౌలుకూడా పేత్రు ప్రాముఖ్యాన్ని గుర్తించాడు. ఆత్మ దిగివచ్చాక ప్రేషితులకు నాయకుడై వారి తరపున యెరూషలేములో మాట్లాడింది పేత్రు - అచ 2,14. అతడే క్రీస్తు పేరుమిదిగా కుంటివాణ్ణి నడిపించాడు-3,6-8. వ్యాధులు నయం చేసాడు - 5,15. క్రీస్తు పేత్రుని ప్రేషితులకు నాయకుణ్ణిగా నియమించబట్టే అతడు వాళ్ళకు అధిపతిగా వ్యవహరించాడు.