పుట:Bible Bhashya Samputavali Volume 09 Jnana Vivaham,Tirusabha P Jojayya 2003 316 P.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పైన ప్రభువే శిష్యులను పిలచి వాళ్లను తన పనికొరకు నియమించాడని చెప్పాం. ఉత్తాన క్రీస్తు ఆత్మ వారివిూదకి దిగివచ్చి వాళ్లు రక్షణ సంఘటనను పరిపూర్ణంగా అర్థం జేసికొనేలా చేసింది. ఈ శక్తితోనే వాళ్ళ తర్వాత క్రీస్తుని గూర్చి బోధింప గలిగారు.

పూర్వవేద ప్రవక్తలకీ నూత్న వేద ప్రేషితులకీ దగ్గరి సంబంధం వుంది. ప్రవక్త మొదట దర్శనాల్లో దేవుణ్ణి చూస్తాడు. అతని సందేశాన్ని వింటాడు. తర్వాత ఆ సందేశాన్ని ప్రజలకు బోధిస్తాడు - యెష 6,1-9. ఈలాగే నూత్నవేద ప్రేషితులు కూడ మొదట ఉత్థాన క్రీస్తుని చూచి అతని సందేశాన్ని వింటారు. తర్వాత ఆ ప్రభువు వాళ్ళను వేదబోధకు పంపుతాడు. పేత్రు పౌలు మొదలైన ప్రేషితులంతా ఈలాంటివాళ్లే, నూత్నవేదంలో పేషిత శబ్దాన్ని కొన్నిచోట్ల విస్తృతార్థంలో వాడారు. పన్నెండుమందిలో చేరని వాళ్ళను గూడ ప్రేషితులని పిల్చారు. బర్నబా, యాకోబు మొదలైనవాళ్లు ఈలాంటివాళ్లు.

ప్రేషితుల పదవి విశిష్టమైంది. తొలి పన్నెండు మందేగాని ఇతరులు ఆ పదవికి అర్జులు కారు. కనుక యాకోబు మరణానంతరం అతని స్థానాన్ని ఇతరులెవరూ పొందలేదు - అ,చ.122. తొలి పన్నెండుమంది గతించడంతో ఆ పదవి కూడ గతించింది.

5. ఇంతవరకు మనం చూచిన అంశాల సారాంశం ఇది. కీస్తు గలిలయ బోధకుముందే పన్నెండుమంది అనుచరులను ఎన్నుకొన్నాడు. అతడు ప్రారంభించిన దైవరాజ్యబోధను కొనసాగించడం వాళ్ళ బాధ్యత, గలిలయ బోధకాలంలో యూదులు క్రీస్తుని నిరాకరించాక ఈ పన్నెండుమందికి నూత్న ప్రాముఖ్యం వచ్చింది. క్రీస్తు ప్రాతయిప్రాయేలీయులను విడనాడి నూత్నయిస్రాయేలీయులను ఎన్నుకొన్నాడు. ఆ నూత్న యిప్రాయేలు మొదట ఈ పండ్రెండుమందితోనే ప్రారంభమైంది. క్రీస్తు ఉత్తానానంతరం వీళ్ళు ఏకబృందంగా ఐక్యమయ్యారు. ఆత్మ వీళ్ళను ప్రబోధించింది. అటుపిమ్మట ఇతరులుకూడ ఉత్తానక్రీస్తుని విశ్వసించి వీళ్ళతో చేరిపోయారు. వీళ్ళంతా కలసి క్రీస్తు సమాజమయ్యారు. ఈ సమాజమే తిరుసభగా రూపొందింది. ఈలా క్రీస్తు సంకల్పం ప్రకారమే తిరుసభ పుట్టింది.

3. పేత్రుకి ఆధిపత్యం

తిరుసభకు మూలస్తంభాలుగా వుండడానికిగాను క్రీస్తు పండ్రెండుమందిని ఎన్నుకొన్నాడని చెప్పాం. వీరిలో మల్లా పేత్రుకి ప్రత్యేకస్థానం వుంది. క్రీస్తే అతనికి ప్రత్యేకమైన బాధ్యతను ఒప్పజెప్పాడు. పేత్రు అనే పునాదిమిూద తిరుసభ అనే భవనం నిలుస్తుంది. ఈ యంశాన్ని విపులంగా పరిశీలిద్దాం.