పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఇంకో విషయంగూడ, క్రైస్తవులమైన మనం ఈ దేశంలో అల్పసంఖ్యాకులం. కనుక మనం చాల యేండ్లుగా కొన్ని సదుపాయాలు, రాయితీలు అనుభవిస్తూ వచ్చాం. సహజంగానే వీటిని పోగొట్టుకోవడానికి ఇప్పడు మనం ఇష్టపడం. ఐనా మనం వీటిని వదలుకోవలసిన రోజు వస్తుంది. పైగా నేడు చాలమంది క్రైస్తవుల్లో భక్తిశ్రద్ధలు లేవు. ఆ మాటకొస్తే క్రైస్తవాధికారుల్లో గూడ చిత్తశుద్ధి, మంచి ఆదర్శం లేవు. మనం విదేశాల ఆర్థిక సహాయంమీద అతిగా ఆధారపడుతున్నాం. మన పేదవర్గాల ప్రజలను చూస్తే, వాళ్లల్లో వాళ్ళకు ఐక్యతలేదు. ఒకరినొకరు కూలద్రోయ జూస్తున్నారు. అందరూ మతం పేరుమీదిగా ఆర్థికలాభాలు పొందాలని కోరుకొనేవాళ్ళే. క్రీస్తుబోధలు పాటించేవాళ్ళు, నిజమైన శిష్యులుగా జీవించేవాళ్ళు చాల తక్కువ. ఈలాంటి పరిస్థితుల్లో వేదహింసలు మనలను మేలుకొల్పి మనకు బుద్ధిచెప్తాయి. మనకు పట్టిన తుప్పను వదిలిస్తాయి. మన మాలిన్యాన్ని కడిగివేసి మనలను శుద్ధిచేస్తాయి. త్రోవదప్పిన మనలను తిరుగ దారికి తీసుకవస్తాయి. మన పాపాలకు, ద్రోహాలకు, వంచనలకు, అక్రమార్థనలకు మనం పశ్చాత్తాపపడేలా చేస్తాయి. మనం భక్తివిశ్వాసాలతో గూడిన క్రైస్తవ జీవితం గడిపేలా చేస్తాయి. ఇందువల్ల వేదహింసలు మనకు కీడుచేసిన దానికంటె మేలే యొక్కువ చేస్తాయి. ఇందుచే మనం ఈ హింసలను ఆహ్వానించాలి. ఇవి లేనప్పుడుకూడ ఇవి వుండాలని కోరుకోవాలి. వీటంతట ఇవి వచ్చినపుడు వీటిని విశ్వాసంతో స్వీకరించాలి.

ఇప్పడు క్రైస్తవులమైన మనకు ఐక్యతలేదు. మనలో మనం కులాల పేరుమీదిగా, వర్గాల పేరుమీదిగా తన్నుకొని చస్తున్నాం. హింసలు మనలను ఐక్యంచేస్తాయి. అందరూ ఒకరినొకరు అంగీకరించి ఒక త్రాటిమీద నడిచేలా చేస్తాయి. మనం బైబులు గ్రంథాన్ని భక్తితో చదివి, దేవద్రవ్యానుమానాలను భక్తితో స్వీకరించేలా చేస్తాయి. క్రీస్తుకి భక్తితో ప్రార్ధన చేసికొని ఆ ప్రభువు సహాయాన్నీ బలాన్నీ పొందేలా చేస్తాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, మనం నిజమైన క్రైస్తవులంగా జీవించేలా చేస్తాయి. అందుచే మనం హింసలకు జంకకూడదు. అవి వచ్చినపుడు వాటిని నిండు మనస్సుతో ఆహ్వానించాలి.