పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రభువు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్ము హింసించే వారికొరకు ప్రార్ధించండి అన్నాడు — మత్త 5,44. ఈ సూత్రం ప్రకారం మనం హింసితులమైనా పగతీర్చుకోవడానికి పూనుకోగూడదు. వారిని క్షమించి వదలివేయాలి. మన క్షమాగుణంవల్ల వారి మనసులు మారవచ్చు.

మూడవ వేయి సంవత్సరంలోగూడ ఇండియాలో క్రైస్తవులు మైనారిటీ వర్గంగానే వుంటారు. కాని భారతదేశ తిరుసభ సేవక తిరుసభగా వుంటుంది. బలిమూర్తియైన క్రీస్తుతోపాటు తానూ శ్రమలు అనుభవిస్తుంది. రోజురోజు దివ్యసత్రసాద బలినర్పిస్తూ ఈ దేశాన్ని సత్ర్పసాద ప్రభావంతో నింపుతుంది.

ఆర్చిబిషప్ రోమేరో తన మరణానికి ముందు ఈలా వాకొన్నారు. "నేను చావునిగాక ఉత్తానాన్ని నమ్ముతాను. శత్రువులు నన్ను చంపితే నేను సాల్వడోర్ ప్రజల్లో మల్లా జీవిస్తాను. నేను వేదసాక్షి మరణానికి పాత్రుణ్ణిగాను. కాని ప్రభువు నా జీవితార్పణను అంగీకరిస్తే, నా రక్తం ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టాలని కోరుకొంటున్నాను. నేను చిందించే నెత్తురుద్వారా నా దేశ ప్రజల ఆశలు ఫలప్రదం కావాలని కోరుకొంటున్నాను. ఈ బిషప్ప చనిపోవచ్చుగాక. కాని తిరుసభ, అనగా ఈ దేశ ప్రజలు ఎంతమాత్రం చనిపోరు." ఈ వాక్యాలు ఇప్పడు మనదేశంలో మనకుకూడ అక్షరాల వర్తిస్తాయి.

కాని భారతదేశంలోని హింసిత తిరుసభ ధైర్యం తెచ్చుకోవాలి. ఆయా కాలాల పొడుగునా ప్రపంచం నలుమూలలా చాలమంది శ్రమలు అనుభవించారు. ఆ శ్రమల్లో వాళ్ళ పుటంవేసిన బంగారంలాగ శుద్దులయ్యారు. "మీకు కలుగబోయే శ్రమలను గూర్చి భయపడవద్దు. మీరు మరణం వరకు విశ్వాస పాత్రులై వుండండి. అపుడు నేను మీకు జీవకిరీటాన్ని అనుగ్రహిస్తాను" - దర్శ 2,10. ఈలాంటి వేదవాక్యాలను నమ్మి మనం ధైర్యంతో ముందుకి సాగాలి.

భారతదేశ తిరుసభ మైనారిటీ సంస్థ. విరోధులు మన విద్య, వైద్య సాంఘిక సేవాసంస్థలకు కీడు తలపెట్టవచ్చు. మైనారిటీ వర్గంగా మనకున్న హక్కులను, సదుపాయాలను తొలగించవచ్చు. మన వేదబోధకు ఆటంకాలు కలిగించవచ్చు. మతాంతరీకరుణను నిషేధించవచ్చు. అసూయ ద్వేషాలతో మన గురువులనూ మఠకన్యలనూ బాధించవచ్చు. వేదహింసలు నానా రకాలుగా వుంటాయి. కాని వీటికి మనం దడవనక్కరలేదు. మతహింసల్లో మనకు ధైర్యాన్నిచ్చేది సత్ర్పసాద శక్తి దానిలో నెలకొని వున్న పవిత్రశక్తి మత్త 10,17-23 వాక్యాలు వేద హింసలను ప్రస్తావిస్తాయి. ఈ హింసల కాలంలో ఆత్మే మనచేత ధైర్యంగా మాట్లాడిస్తుందని చెప్తాయి.