పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూర్వం దివ్యసత్ర్పసాదం వేదహింసల్లో తార్సు వాసియైన పౌలు భక్తునికీ, అంటియోకయ బిషప్పయిన ఇగ్నేప్యసుగారికీ బలాన్నిచ్చింది. ఆఫ్రికా, జపాను వేదసాక్షులకు ధైర్యాన్నిచ్చింది. అదే దివ్యభోజనం ఇప్పుడు మన దేశంలోని ఒరాను, ముండా, నాగ, వర్గీ, వాసవి, డాంగి, మాల, మాదిగ వర్గాల క్రైస్తవులకు శక్తి నిస్తుంది. పిశాచశక్తులు మానవ హక్కులను భంగపరచి చావుని తెచ్చిపెడతాయి. కాని సత్ర్పసాదం నరులకు విమోచనాన్నీ జీవాన్నీ ప్రసాదిస్తుంది. వేదహింసలకు గురైనవాళ్ళు శ్రమలు అనుభవిస్తారు. ఆత్మార్పణం చేసికొంటారు. పౌలు భక్తుడు “మీ శరీరాలను పవిత్రమూ సజీవమూ ఐన యాగంగా దేవునికి అర్పించుకోండి" అని చెప్పాడు - రోమా 12,1.

పాస్కవున్నచోట హింసకూడ వుంటుంది. యూదుల పాస్కఫరో చక్రవర్తి హింసను పురస్కరించుకొని వచ్చింది. క్రీస్తు పాస్కలో శ్రమలూ మరణమూ వున్నాయి. ఆదిమ క్రైస్తవుల శ్రమల్లో, వేదసాక్షుల మరణంలో హింసవుంది. నేడు పాస్మబలినీ దాని ప్రతిరూపమైన దివ్యసత్ర్పసాద బలినీ సమర్పించుకొనే మనకు కూడ హింసలు తప్పవు. కాని ఈ హింసల్లోనే మనకు జీవం లభిస్తుంది.

క్రీస్తు వచ్చాక 2000 సంవత్సరాలు గతించాయి. ఇప్పుడు మూడవవేయి సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ మూడవ సహస్రాబ్దంలో కూడ మనకు తిప్పలు తప్పవు, మన బాధలు పూర్వభక్తులు బాధల కంటె ఇంకా అధికంగా పెరుగుతాయి. "క్రీస్తు శ్రీసభ కొరకు పడిన బాధల్లో కొదవగా వున్న వాటిని నేను నా శ్రమల ద్వారా పూర్తిచేస్తున్నాను" అన్న పౌలుభక్తుని వాక్యాలను మనమందరం స్మరించుకోవలసివస్తుంది - కోలో 1,24

పూజలో మనం బలిమూర్తియైన క్రీస్తుతోపాటు అతని శరీర రక్తాలతోపాటు, మనబాధామయ జీవితాలను తండ్రికి అర్పించుకోవాలి. “ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం", "ఇది మీ కొరకు చిందింపబడనున్న నా రక్తం" అనే క్రీస్తు పలుకులు మనకు అనుదినం ప్రేరణం కలిగిస్తుంటాయి. ఆ జీవమయ శరీరాన్నిభుజించి ఆ పాత్రలోని రక్తాన్ని పానంజేసి మనం కొంతవరకు శ్రమలకు తట్టుకోగలుగుతున్నాం.

తిరుసభ దివ్యసత్ర్పసాదాన్ని సిద్ధంచేస్తుంది. ఐతే దివ్యసత్ర్పసాదం తిరుసభను నిర్మిస్తుంది. అనగా మనం దివ్యసత్ర్పసాదాన్ని యోగ్యంగా భుజించి తిరుసభను ఓ భవనంలా కట్టుకొనిపోతాం. దాని పెంపుకి తోడ్పడతాం. అది అన్ని తావుల్లో వ్యాపించేలా కృషిచేస్తాం. ఉత్థాన క్రీస్తు తండ్రి నన్ను పంపినట్లే నేనూ మిమ్మలను పంపుతానని వాకొన్నాడు - యోహా 20,21. మన ప్రేషిత సేవద్వారానే మనం తిరుసభను వ్యాప్తిచేస్తాం.