పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వుంటాయనుకొన్నారు. కాని క్రీస్తు ఈ భావాలను ఎంతమాత్రం అంగీకరించలేదు. అతని దృష్టిలో మెస్సీయా దీనుడు, శ్రమలు అనుభవించేవాడు. దైవరాజ్యాన్ని స్థాపించడం అతని ప్రధాన పూచీ. పేదలు, పాపులు, అట్టడుగువర్గం ప్రజలు ఈ దైవరాజ్యంలో చేరారు. ప్రభువు కుష్టరోగులు, బెస్తలు, వ్యభిచారిణులు మొదలైన భ్రష్టవర్గాలతో కలసిపోయాడు. దీనులు హీనులు ఐన ప్రజలతో ఐక్యమయ్యాడు.

యేసు ఆకలిదప్పలు శ్రమలు అనుభవించాడు. తన ప్రజల శ్రమలను జూచి కన్నీరు కార్చాడు. పరిసయులు ధర్మశాస్తానికి సంకుచిత భావంతో అర్థం చెప్పడం అతనికి నచ్చలేదు. అతని దృష్టిలో పరలోకపు తండ్రి కరుణగలవాడు. జంతుబలులూ ఆచారాలూ కోరుకొనేవాడు కాదు. ఆ తండ్రి పరమ పవిత్రుడు. కనుక క్రీస్తు యూదులందరినీ తమ పాపాలకు పశ్చాత్తాపపడమని హెచ్చరించాడు. అతడు యెషయా ప్రవక్త పేర్కొన్న బాధామయ సేవకుడు తానేనని నమ్మాడు.

యూద నాయకులకు క్రీస్తు గిట్టలేదు. వాళ్ళు అతని చావుని కోరారు. ప్రభువు తాను యెరూషలేములో చనిపోతానని ముందుగానే ఊహించాడు. తండ్రి చిత్తానికి లొంగాడు. దేవాలయాన్ని శుద్ధిచేసినపుడు, విశ్రాంతిదినం నరులకోసం వుందిగాని నరులు విశ్రాంతి దినం కొరకు లేరని చెప్పినపుడు యూద నాయకులు ఆగ్రహం చెంది అతన్ని హత్యచేయాలని సంకల్పించుకొన్నారు.

పైగా అతడు దేవుడు నాకు తండ్రి అని చెప్పకొన్నాడు. శిష్యులను కూడ అతన్ని తండ్రి అని పిలువమన్నాడు. అతడు పరిసయులను విషసర్పాలనుగా చిత్రించాడు. హెరోదుని గుంటనక్క అని పిల్చాడు. ఈ క్రియలన్నీ అగ్రవర్గంవారి కోపావేశాలను రెచ్చగొట్టాయి. పూర్వ ప్రవక్తల్లాగే, స్నాపక యోహానులాగే క్రీస్తుకూడ హింసకు మృత్యువుకు గురయ్యాడు.

ఒక నరుడు జాతి అంతటి కొరకు చనిపోవడం అనే సూత్రం యూదులకు బాగా తెలుసు. ప్రభువు తన మరణంద్వారా ప్రజల పాపాలకు పరిహారం జరుగుతుంది అనుకొన్నాడు. కనుక తాను అనేకుల రక్షణార్థం తన ప్రాణాలు ధారపోయాలని సంకల్పించుకొన్నాడు - మార్కు 10,45. అతని మరణం పాపపరిహార బలి ఐంది. సువిశేషాలు అతన్ని బాధలు అనుభవించే మెస్సీయానుగా వర్ణిస్తాయి. ప్రజల కొరకు చనిపోయే వ్యక్తినిగా చిత్రిస్తాయి. సమానాంతర సువిశేషాల్లో క్రీస్తు మూడు పర్యాయాలు తన మరణోత్థానాలను పేర్కొన్నాడు. ఐనా శిష్యులు అతని మరణావసరాన్ని గ్రహించలేదు. పైగా పేత్రు నీకు సిలువ మరణం ఎంతమాత్రం తగదని అతన్ని వారించాడు- మత్త 16,23.