పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నరులు పరస్పర ప్రేమతో జీవించేలా చేసే సాధనం. నేడు నరులు నూత్న సమాజంగా రూపొందాలంటే ఈ దివ్యభోజనమే ప్రధాన మార్గం.

1. నూత్న సమాజం కోరికలు

నేటి సమాజం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంతో పురోగతి సాధించింది. కాని ఎంత అభివృద్ధిని సాధించినా నేటి నరులకు శాంతి సంతోషాలు లేవు. ఈనాటి మానవులు ప్రధానంగా వాంఛించే సౌభాగ్యాలు ఇవి. 1. శాంతి, సంతోషం, స్వేచ్చ సమానత్వం నరుల్లో వర్ధిల్లాలి. 2. సమాజంలో అన్యాయాలు అంతరించి న్యాయం నెలకొనాలి. 3. నరులు పరస్పర ప్రేమ భావంతో కలసి మెలసి జీవించాలి. ఈ గుణాలన్నీ కలదే ప్రేమ సమాజం.

క్రీస్తు వచ్చింది విశేషంగా ఈ ప్రేమ సమాజాన్ని నెలకొల్పడానికే, కాని అతడు కేవలం సాంఘికసేవ ద్వారా ఈలాంటి ప్రేమ సమాజాన్ని నెలకొల్పడానికి పూనుకోలేదు. తన మరణోత్తానాల ద్వారా, క్రియాపూర్వకమైన ప్రేమ ద్వారా ఈ సమాజాన్ని స్థాపించాడు. అదే తిరుసభ, ఈ తిరుసభకు తన జ్ఞాపకార్థం, అనగా భక్తులు తన ప్రేమను జ్ఞాపకం చేసికోవడానికి, దివ్యసత్రసాదాన్ని ఇచ్చాడు. కనుకనే క్రైస్తవులు భక్తిభావంతో ఈ సత్రసాద బలిని రోజురోజు కొనసాగించుకొని పోతున్నారు. లోకాంతం వరకు, నరుల్లో ప్రేమశక్తి బలంగా వేరుపాతుకొనేంతవరకూ, ఈ బలి మనమధ్య కొనసాగుతూనే వుంటుంది.

2. ఆదిమ క్రైస్తవ సమాజంలో సత్రసాదం

తొలినాటి క్రైస్తవులు కొందరి గృహాల్లో సమావేశమై అపోస్తలుల బోధలు విన్నారు. ప్రార్థనలు చేసారు. యూదమతంతో తమకు ఎదురయ్యే సమస్యలను చర్చించి చూచుకొన్నారు. ఉమ్మడి భోజనం చేసారు. కడన సత్రసాద బలిని సమర్పించి దివ్యభోజనం స్వీకరించారు. దాని ఫలితంగా వాళ్లు ప్రేమభావంతో జీవించారు. ఉన్నవాళ్ళ తమ సాత్తును లేనివాళ్ళతో పంచుకొన్నారు. వారిలో ధనిక, దరిద్ర తారతమ్యాలు లేవు. తమ ఆస్తులను అపోస్తలులకు అప్పగించి ఉమ్మడి జీవితం గడిపారు. అప్పటి క్రైస్తవులకు ప్రత్యేకమైన గుర్తు ఏదీలేదు. సత్రసాద విందూ పరస్పర సహాయమే వారి గుర్తులు. సత్రసాదం లోని ప్రేమాజ్ఞ వాళ్ళను బలంగా ప్రేరేపించింది. లేకపోతే వాళ్ళ తమ సొమ్మను పేదలతో పంచుకొనేవాళ్ళ కాదు - అ,చ. 2,42-47, 4,32-35.