పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రీస్తుతో కంటె గూడ అతని ఆధ్యాత్మిక శరీరమైన శ్రీసభతో ఎక్కువగా ఐక్యమౌతామని నుడివాడు. అతని భావాల ప్రకారం ఈ సంస్కారం ప్రధాన ఫలితం సోదర ప్రేమ.

5. ఉపసంహారం, దివ్యసత్ర్పసాదం ప్రాముఖ్యం

మీదటి అధ్యాయాల్లో దివ్యసత్రసాదాన్ని గూర్చిన పలు విషయాలను చర్చించాం. ఈ భోజనం మామూలు సంస్కారం కాదు. ఇది అన్ని సంస్కారాల కంటె మిన్నయైంది. తతిమ్మా ఆరు సంస్కారాలూ తామిచ్చే ప్రత్యేక వరప్రసాదాలను దీనినుండే పొందుతాయి, అవి దీనిమీద ఆధారపడి పనిచేస్తాయి. కారణం ఇది. తతిమ్మా ఆరు సంస్కారాల్లో క్రీస్తు వరప్రసాదం వుంటుంది. కాని ఈ సంస్కారంలో మాత్రం ఆ వరప్రసాద కారకుడైన ఉత్తాన క్రీస్తే ఉంటాడు. వరప్రసాదమంతా ఉత్తాన క్రీస్తు నుండే కనుక అన్నిసంస్కారాలు ఈ దివ్యసత్రసాదం మీద ఆధారపడి పనిచేస్తాయి.

ఈ సంస్కారం వరాల నిధి. వరప్రసాద జలధార, దీనిద్వారా ఆత్మను నీటిని త్రాగినట్లుగా త్రాగుతాం - 1కొ 12, 13. జ్ఞానస్నానం ఈ సంస్కారం ద్వారా పరిపూర్ణమవుతుంది. దీనినుండే వరప్రసాదం పొందుతుంది. అసలు దివ్యసత్రసాదమే పాపోచ్చారణం ద్వారా మన పాపాలను పరిహరిస్తుంది, ఈలాగే అన్ని సంస్కారాలు ఈ పరమ భోజనం ద్వారానే వరాలార్జించిపెడతాయి.

తోమాసు అక్వినాసు భక్తుడు ఈ సంస్కారం లేందే రక్షణం లేదని వాకొన్నాడు. అనగా ఈ సంస్కారాన్ని మనం వస్తుతః స్వీకరించి వుండకపోయినా దాని ప్రధాన ఫలితమైన సోదరప్రేమను స్వీకరించి వుండాలి. ఇది లేందే మోక్షప్రాప్తి లేదు.

ఈలాంటి దివ్యభోజనాన్ని యోగ్యంగా స్వీకరించాలంటే మన తరపున మనకు ఎంతో భక్తి వుండాలి. ఆ భోజనం ఎంత శక్తికలదైనా మన సహకారమూ భక్తి లేనిదే పనిచేయదు. ఇక మన భక్తిలో రెండంశాలు ముఖ్యం - దైవప్రేమ, సోదరప్రేమ. ఈ ద్వివిధమైన ప్రేమతో ఈ పరమానాన్నిభుజించేవాడు మృత్యువును జయించి అమరత్వాన్ని పొందుతాడు - యోహా 6,54.

దివ్యసత్రసాదం త్రికాలాలకు సంబంధించిన మన రక్షణ చరిత్ర నంతటినీ జ్ఞప్తికి తెచ్చేది. అది పూర్వం జరిగిన క్రీస్తు సిలువ బలిని గుర్తుకు తెస్తుంది. అతని మరణోత్తానాలను జ్ఞాపకం చేస్తుంది. అంతమాత్రమే గాక అది ప్రస్తుతం శ్రీసభలో క్రీస్తు సాన్నిధ్యముందని గూడ తెలియజేస్తుంది. ఇంకా అది రాబోయే మోక్షమహిమను గూడ సూచిస్తుంది. ఉత్తాన క్రీస్తు మనకు గూడ ఉత్తానం దయచేస్తాడని తెలియజేస్తుంది. ఈ విధంగా దివ్యసత్రసాదబలి మూడు కాలాలకు సంబంధించిన రక్షణ చరిత్రనంతటినీ తనలో ఇముడ్చుకొంటుంది.