పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మన ఉత్తానాన్ని గూర్చి చెపూ సిరిల్ భక్తుడే ఈలా వ్రాసాడు. "ప్రభువు తన్ను భుజించినవాణ్ణి అంత్యదినాన లేపుతానన్నాడు. జీవనమూర్తియైన ప్రభువు మన మృత్యువుని తప్పక నాశం చేస్తాడు. ప్రభువు జీవన శరీరం మనలో వుంది. మరి అది మనకు జీవమీయకుండా వుంటుందా? మనం నిప్పకణిక చుటూ ఊకను పేరుస్తాం. ఆయగ్నిబీజం ఆ వూకను మండిస్తుంది. అలాగే క్రీస్తు కూడ తన జీవన శరీరాన్ని ఓ బీజం లాగ మన శరీరంలోకి ప్రవేశపెడతాడు. ఈ యమృత బీజం మన మృత్యువుని నాశం చేసి మనకు ఉత్తానాన్ని దయచేస్తుంది". ఇవి ఉదాత్తమైన భావాలు కదా!

దివ్యసత్ర్పసాదం ఉత్థాన క్రీస్తు శరీరం. దానిలో పరిశుద్దాత్మకూడ వుంటుంది. ఆత్మశక్తితోనే గదా క్రీస్తు ఉత్తానమైంది? మనం దివ్యసత్రసాదాన్ని స్వీకరించినపుడు దానిలోని ఆత్మ మనకు గూడ ఉత్థానాన్ని దయచేస్తుంది. ఈ భావాన్ని మాప్పవెస్తియా తియోడోరెట్ అనే వేదాంతి ఈలా వివరించాడు. "గురువు రొట్టెరసాలను ఆశీర్వదించి అవి క్రీస్తు శరీరరక్తాలు అన్నపుడు ఆత్మ వాటిమీదికి దిగివచ్చి వాటిని అభిషేకించి అమృతమయం చేస్తుంది. పూర్వం క్రీస్తు మృతదేహాన్ని అభిషేకించి దానికి ప్రాణమిచ్చిన ఆత్మే యిపుడు ఈ భౌతిక పదార్థాలను గూడ ప్రాణమయం చేస్తుంది. కనుక ఆత్మ అభిషేకం ద్వారా ఇవి కూడ ఆ క్రీస్తు ఉత్తాన దేహంలాగే అనశ్వరాలూ అబాధితాలూ అమృతమయాలు ఔతాయి. ఇక, మనం ఈ శరీరరక్తాలను భుజించినపుడు అవి తమలో వున్న ఆత్మశక్తిద్వారా మనకు గూడ అమరత్వం దయచేస్తాయి. వాటిలో వున్న ఆత్మ వరప్రసాదం మనలోనికి ప్రవహించి మనలను చావులేని వాళ్ళనుగా చేస్తుంది."

3. మన కానుకలే మనకాహారం

మనం భుజించే దివ్యసత్రసాదం పూర్వం మనమర్పించిన కానుకలే. మనం భౌతిక పదార్థాలైన రొట్టెరసాలను దేవునికి కానుకగా అర్పిస్తాం. పూజలో సమర్పణ భాగంలో ఈ కార్యం జరుగుతుంది. మనమర్పించిన కానుకలను దేవుడు అంగీకరిస్తాడు. వాటిని ఆశీర్వదిస్తాడు, తన సాన్నిధ్యంతో నింపుతాడు. ఈ కార్యం నడిపూజలో జరుగుతుంది. ఆ ప్రభువు మనమిచ్చిన కానుకలను తిరిగి మనకే భోజనంగా అందిస్తాడు. వీటిని మనం భుజిస్తాం. భుజించి ప్రభువు జీవంతో, అతని ఆత్మతో నిండిపోతాం. ఈ కార్యం దివ్యసత్ర్పసాద స్వీకార సమయంలో జరుగుతుంది. కానుకలు అర్పించడం బలి. వాటిని భుజించడం సత్రసాదం. బలినర్పించడమూ, సత్ర్పసాదాన్ని భుజించడమూ రెండూ ముఖ్యమే. అసలు అవి రెండూ కలసి ఒకే ఆరాధన. ఈ యారాధనం మన కానుకలను దేవునికి అర్పించడం, అతడు వాటిని మళ్ళా మనకందీయడం అనే రెండు క్రియలతో - ఇచ్చి పుచ్చుకోవడంతో - కూడి వుంటుంది.