పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈలా కానుకలను ఇచ్చిపుచ్చుకోవడం పవిత్రమైన కార్యం. నరుడు సృష్టివస్తువుల రూపంలో దేవుడు తనకిచ్చిన కానుకలనే దేవుని కర్పిస్తాడు. దేవుడు ఆ కానుకలను తీసికొని వాటిని తన సాన్నిధ్యంతో నింపుతాడు. వాటిని వాటిద్వారా తన్నూ, భక్తునికి దయచేస్తాడు. ఈలా తాను పొందిన కానుకలను దేవునికిచ్చిన భక్తుడు, మళ్ళా ఆ కానుకల ద్వారానే దేవుణ్ణి పొందుతాడు.

పూర్వం మోషేద్వారా దేవుడు ఓ ప్రజను ఏర్పరచుకొన్నాడు. సీనాయి నిబంధనతో మోషే నాయకత్వాన యిస్రాయేలీయులు యావే ప్రజలయ్యారు. అతన్ని కొలచే భక్తులయ్యారు. ఈనాడు క్రీస్తుద్వారా తండ్రి మరో ప్రజను ఏర్పరచుకొంటాడు. క్రీస్తు సిలువబలిలో పాల్గొని అతన్ని ఆహారంగా పుచ్చుకొనే వాళ్ళంతా తండ్రి ప్రజలౌతారు.

నేడు గురువు ప్రజలవైపు మళ్ళి ప్రజలకు అభిముఖంగా వున్న పీఠంమీద, పూజచేస్తాడు. ఈపీఠం భోజనపు బల్ల, కనుక పూజలో విశ్వాసులందరినీ ఈ బల్ల దగ్గరికి భోజనానికి ఆహ్వానించినట్లవుతుంది. ఇంకా ఈ పీఠం క్రీస్తుని సూచిస్తుంది కూడ ఈ పీఠంమీద, ఇది సూచించే క్రీస్తుద్వారా, తండ్రికి బలినర్పిస్తాం. పూర్వవేదంలో గూడ పీఠం దేవునికి గుర్తు. యూదులు పీఠంమీద, అది సూచించే దేవునికి బలినర్పించారు. కాని నూత్నవేదంలో మనం మన పీఠం సూచించే క్రీస్తుకి బలినర్పించం, ఆ క్రీస్తుద్వారా తండ్రికి బలినర్పిస్తాం. ఆ క్రీస్తునే తండ్రికి బలిగా, కానుకగా అర్పిస్తాం. అలా మనం అర్పించిన క్రీస్తునే తండ్రి మళ్ళా మనకు భోజనంగా అందిస్తాడు.

4. పాపపరిహారమూ, కృతజ్ఞతా

పాపోచ్చారణం ద్వారా పాపపరిహారం పొందుతామని మనకు తెలుసు. కాని దివ్యసత్ప్రసాదం ద్వార గూడ చావైన పాపాలకు పరిహారం లభిస్తుంది. మనం చావైన పాపం కట్టుకొనినపుడు అంతకు పూర్వమే భుజించిన దివ్యసత్ర్పసాదం ఫలితంగా పశ్చాత్తాపం కలుగుతుంది. ఆ పశ్చాత్తాపంతోనే పాపసంకీర్తనం చేసి పాపపరిహారం పొందుతాం. నాడు క్రీస్తు సిలువబలి ద్వారా సాధించిన పాపపరిహారాన్ని నేడు ఈ దివ్యభోజనం మనకు వర్తింపజేస్తుంది. ఫలితంగా మనం చావైన పాపాలను గూడ తొలగించుకొంటాం. ఇది మన చావైన పాపాలనే పరిహరిస్తే స్వల్ప పాపాలను తప్పక పరిహరిస్తుంది. కనుక పాపోచ్చారణం ద్వారా మాత్రమే పాపాలు పరిహారమౌతాయి అని చెప్పకూడదు. సత్ర్పసాదం ద్వారా గూడ ఆ కార్యం జరుగుతుంది.

పూజబలీ దివ్యసత్ప్రసాద స్వీకారమూ, ముగిసాక కొంచెం కాలంపాటు గుడిలోనే వుండి దేవునికి వందనాలు అర్పించాలి. ఈ రక్షణ కార్యంలో పాల్గొనే భాగ్యం