పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


పాల్గొంటారనీ విదితమవుతుంది. 3. పీఠాధిపతి తన గురువులతోను, విశ్వాసులతోను కలసి పూజచేస్తే స్థానిక శ్రీసభ ఐక్యతకూడ వెల్లడి ఔతుంది. కనుక ఐక్యతాభావం ఈ సంయుక్తపూజ ప్రధాన ఫలితం.

సంయుక్తపూజ ఒకేపూజా లేక ఎందరు గురువులు పాల్గొంటే అన్ని పూజలౌతుందా? పూర్వం ఎందరు గురువులు పాల్గొన్నారో అన్ని పూజలనుకొన్నారు. కాని ఎందరు గురువులు పాల్గొన్నా అది ఒకేపూజ అనే భావం నేడు ప్రచారంలో వుంది. ఐనా ఈ ప్రశ్నకు ఇంతవరకు తృప్తికరమైన జవాబులేదు. వేదశాస్తులలో గూడ ఏకాభిప్రాయం లేదు. సంయుక్తపూజ ఒక్కటే ఐతే ఆ పూజలో పాల్గొనే గురువులందరూ పూజరుసుం తీసుకోవచ్చా అన్నది సమాధానం దొరకని మరో ప్రశ్న ఈలాంటి సందేహాలు కొన్ని వున్నా ఈ సంయుక్తపూజ జరుపదగిందే. చాలమంది గురువులు కలసి చేసే పూజలో ఎక్కువ భక్తిభావం వుంటుంది. విశ్వాసులు కూడ దీనివల్ల విశేష లాభం పొందవచ్చు.

ప్రార్థనాభావాలు

1. గురువులతో కలసి పూజబలి నర్పించడం గృహస్తుల హక్కు ఈ హక్కువాళ్ళకు జ్ఞానస్నానం ద్వారానే లభిస్తుంది. యాజకుడైన క్రీస్తులోనికి జ్ఞానస్నానం పొందినపుడు వాళ్ళు "ఎన్నుకోబడిన జనమూ పరిశుద్ధ ప్రజలూ శ్రేషులైన యాజకులూ' ఔతారు - 1పేత్రు 2,9. ఈ హక్కుతోనే వాళ్ళు పూజబలిలో పాల్గొంటారు, గురువుతో పాటు పూజబలి నర్పిస్తారు.

2. అగస్టీను భక్తుడు ఈలా చెప్పాడు. “మన యాజకుడైన క్రీస్తు పీఠం మీద తన్ను తాను ఆత్మార్పణం చేసికొంటాడు. అతడు శిరస్సు, మనం అవయవాలం. కనుక ఆ శిరస్సుతో పాటు అవయవాలమై మనం కూడ తండ్రికి ఆత్మార్పణం చేసికోవాలి". కనుక ఆ ప్రధాన యాజకునితో పాటు అతని ఆధ్యాత్మిక శరీరమైన మనంకూడ దేవునికి నివేదితులం కావాలి.

3. సమర్పణ సమయంలో గురువు "సోదరులారా! మనం అర్పించే యీ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రియపడేలాగ ప్రార్ధించండి" అంటాడు. కనుక పూజ గురువు సమర్పించేది మాత్రమే కాదు. విశ్వాసులు సమర్పించేది కూడ. గృహస్తులకు ఇది మన పూజ అన్న భావం కలగాలి. ఆ పూజలో వాళ్ళు తమ కోరికలనూ అవసరాలనూ ఆందోళనలనూ శ్రమలనూ క్రీస్తుద్వారా తండ్రికి అర్పించుకోవాలి. వేదనలతో కూడిన ప్రతిదిన జీవితాన్ని పునీతం జేసికొనే మార్గం ఇది.