పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనపూజ ఆ మోక్షారాధనంతో జోడింపబడుతుంది. క్రీస్తు ఈ లోకంలో శ్రీసభ అర్పించే పూజారాధనను స్వీకరించి దాన్ని తన మోక్షారాధనంతో ఐక్యం జేసికొంటాడు. కనుక మన యీ యిహలోకారాధనం అతి పవిత్రమైంది.

3. పూజబలి సిలువబలికి అవమానకరమా?

ప్రోటస్టెంటు సంస్కరణ నాయకులైన లూతరు, స్వింగ్లీ, మెలంకోను మొదలైనవాళ్ళ పూజబలి యథార్థమైన బలి కాదన్నారు. అది కేవలం సిలువబలిని తెచ్చే తంతు మాత్రమే నన్నారు. దానివల్ల పాపపరిహారం జరగదని వాదించారు. అది కేవలం మనుష్యులు తలపెట్టిందే గాని దేవుడు కోరింది కాదని వాకొన్నారు. వాళ్ళు ఈ పూజను నిరాకరించడానికి ముఖ్య కారణం ఇది. హెబ్రేయులు జాబు మాటిమాటికీ క్రీస్తు ఒకే ఒక్కసారి ఏకైక బలిని అర్పించాడని నుడువుతుంది - 7,27. అలాంటప్పడు మనం మళ్ళా పూజబలులు అర్పించడం దేనికి? మనం ఈలా మళ్ళామళ్ళా పూజబలులు అర్పిస్తున్నామంటే ఆ క్రీస్తు బలి నిప్రయోజన మైనట్లే గదా? కనుక మన బలులు ఆ సిలువ బలికి అవమానకరం. అసలు మన పూజబలి బలే కాదు.

టెంటు మహాసభ ప్రోటస్టెంటు నాయకుల వాదనను ఖండించి పూజబలి యథార్థమైన బలేనని బోధించింది. హెబ్రేయుల లేఖ నుడివినట్ల క్రీస్తు ఒకే ఒక్కసారి బలినర్పించిన మాట నిజమే. కాని ఆ యేకైక బలిని మనం పూజలో మళ్ళామళ్ళా నూతీకరించుకోవడంలో బాధ యేమీ లేదు. దీన్ని నా జ్ఞాపకార్థం చేయమన్న ప్రభువు కూడ మనం ఆ కల్వరి బలిని తేపతేపకు నూతీకరించుకోవాలనే కోరాడు. పైగా మన పూజబలి ఆ కల్వరి బలికంటె భిన్నమైంది కాదు. మనం పూజబలిలో ఏదో క్రొత్తబలి నర్పిస్తే అప్పడు కల్వరిబలికి అవమానం కలిగించినట్ల, మరి ఆ కల్వరి బలినే నూతీకరించుకొంటే ఈలాంటి చిక్కేమీ లేదు. పూజబలిలోనూ కల్వరి బలిలోనూ యాజకుడూ బలిపశువూ ఒక్కడే - క్రీస్తు. కనుక ఆ బలీ ఈ బలీ ఒక్కటే. పూజలో కల్వరి బలిని మళ్ళా జ్ఞప్తికి తెచ్చుకొంటాం. ఆ బలి ఈ బలిలో ప్రత్యక్షమవుతుంది. ఆ బలి ఫలితాలను ఈ బలిలో పొందుతాం. కనుక పూజబలి బలి కాదు, దాన్నసలు సమర్పించనేకూడదు అన్న ప్రోటస్టెంటు వాదం చెల్లదు.

4. పూజబలి సిలువబలిమీద ఆధారపడుతుంది

16వ శతాబ్దంలో ప్రోటస్టెంటు నాయకులు పూజబలి అసలు పనికిరాదు అని వాదిస్తుంటే, క్యాతలిక్ నాయకులు పూజబలి దానంతట అదే సరిపోతుంది అన్నట్లుగా