పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాట్లాడారు. ఇప్పడు కూడ కొందరు క్యాతలిక్కులు పూజబలిని సిలువబలితో జోడించరు. దాన్ని ఓ స్వతంత్ర బలిగా ఎంచుతారు. దానంతట అది సరిపోతుంది అనుకొంటారు. కాని ఇది పొరపాటు. పూజబలి దానంతట అది నిలవదు. అది సిలువబలిని మన మధ్యలో సాక్షాత్కారం చేసేది కనుక దాని విలువ సిలువను బట్టే వచ్చింది. కనుక పూజబలి కల్వరి బలిమీద ఆధారపడేది.

కల్వరిబలి ఏకైక బలి. ఐనా దాన్ని నేడు సంస్కార (దేవ ద్రవ్యానుమాన)రూపంలో మన మధ్య నూతీకరించుకోవచ్చు కల్వరిబలి నేడు రెండు రూపాల్లో కొనసాగుతూంటుంది. మోక్షంలో క్రీస్తు తండ్రి యెదుట చేసే మనవి రూపంలో కొనసాగుతుంది - హెబ్రే 725. భూలోకంలో పూజరూపంలో కొనసాగుతుంది.

ఈలా చూస్తే పూజకు విలువుంది. కాని ఆ విలువ స్వయంసిద్ధమైంది కాదు. కల్వరిబలి నుండి వచ్చింది. సిలువ బలి నదీజన్మస్థలం లాంటిది, పూజబలి నది లాంటిది. జన్మస్థలంలో నుండి నీరు ఊరి నదిలోకి ప్రవహిస్తుంది. అలాగే కల్వరి బలిలోనుండి క్రీస్తు ఆర్ధించిన వర ప్రసాదాలు పూజలోకి ప్రవహిస్తాయి. నది జన్మస్థలంమీద ఆధారపడినట్లే పూజ సిలువబలిమీద ఆధారపడుతుంది. కాని నదే జన్మస్థలం అని చెప్పకూడదు.


5. పూజ - ఆత్మార్పణం

బలిలో ముఖ్యమైన భావం ఆత్మార్పణం. దేవుడికి కావలసింది మన బలిదానంకాదు. మనమే. ఎప్పడుకూడ మన మర్పించే కానుక మనకు చిహ్నం. కనుక మన మర్పించే కానుకతోపాటు మనలను మనమే దేవునికి అర్పించుకోవాలి. ఆ బాహ్యార్పణంతోపాటు ఈ యాంతరంగిక అర్పణంకూడ వుండాలి. లేకపోతే బలికి విలువలేదు. కనుక పూజలో క్రైస్తవ భక్తుడు తన్ను తాను దేవునికి కానుక చేసికోవాలి. క్రీస్తు అలా ఆత్మార్పణం చేసికొన్నాడు. పుట్టువునుండి కూడ అతని జీవితమంతా దేవునికి అర్పణమే. ఆ యర్పణంలో తుదిమెట్టు సిలువబలి. పుట్టినదాదిగా అతడు "దేవా! నీ చిత్తం నెరవేర్చడానికే నేను వచ్చాను" అని చెపూవచ్చాడు - హెబ్రే 10,9. ఈ క్రీస్తు మన ఆత్మార్పణకు ఆదర్శం.

మన శరీరాలను సజీవయాగంగా దేవునికి అర్పించుకోవాలి అన్నాడు పౌలు - రోమా 12,1. యెరూషలేములో పశువులను యాగంగా సమర్పించారు, కాని అలా సమర్పించినపుడు ఆ పశువులు చనిపోయేవి. నూత్నవేదంలో మనలను మనం యాగంగా అర్పించుకొంటాం. కాని ఈ యాగంలో మనం చనిపోం, బ్రతికే వుంటాం. కనుక మనది సజీవయాగం, ప్రతిదిన పూజలో క్రీస్తుతో ఐక్యమై మనలను మనం తండ్రికి అర్పించుకొన్నపుడు ఈ సజీవయాగం నెరవేరుతుంది.