పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రలోభాలు కలిగినప్పడు మనంకూడ ఆ భక్తునిలాగే ప్రభువు గ్రంథం చదువుకోవాలి. దేవళంలో అతనికి ప్రార్ధన చేసికోవాలి. అప్పడు దేవుడు మనకు జ్ఞానోదయం కలిగిస్తాడు. మన కర్తవ్యం బోధపడుతుంది. ప్రలోభాలు తొలగిపోతాయి.

2 ఈ కీర్తనలోని 25 చరణం మన భక్తికి కొలత బద్దగా ఉంటుందని చెప్పాం. ప్రాపంచిక మానవులకు దేవుడొక్కడు రుచింపడు. లోకవస్తువులన్నీ రుచిస్తాయి. ఆధ్యాత్మిక మానవునికి లోకవస్తువులేవీ రుచించవు. దేవుడొక్కడు రుచిస్తాడు. ఈ సూత్రాన్ని బట్టే మనమేలాంటి నరులేమో తెలిసికోవచ్చు. ఈ సందర్భంలో మహాభక్తుడైన పౌలు కూడ "నాకు జీవించడమంటే క్రీస్తే" అని నుడివాడు - పిలి 1, 21.

3 ఈ కీర్తనకారునికి భక్తసమాజంతో ఉన్న సంబంధం వలన అతడు వారికీ దేవునికీ ద్రోహం చేయలేకపోయాడు. తోడి ఆరాధకుల భక్తి అతని భక్తిని నిలబెట్టింది. ఆలాగే యూనాడు తోడి క్రైస్తవుల భక్తి మన భక్తిని నిలబెడుతుంది. కనుక మనం భక్తసాంగత్యాన్ని పెంపొందించుకోవాలి.

4 ఈ భక్తుడు దేవునిచెంత ఉండడమే తనకు క్షేమకరం అని భావించాడు (28). విశ్వాసం ద్వారా దేవుణ్ణి గాఢంగా అనుభవానికి తెచ్చుకొన్నాడు. కావుననే ప్రలోభాలకూ శోధనలకూ తట్టుకొని నిలువగలిగాడు. మోక్షం అతనికి ఈ భూమి మీదనే ప్రారంభమైంది. మన భక్తి విశ్వాసాలు కూడా ఈలా ఉండాలి. ఈ 23వ చరణం అగస్టీను భక్తునికి మిక్కిలి ప్రీతిపాత్రమైంది. అతని మాటల్లో, దేవుని చెంతవుంటే మనకు జీవం లభిస్తుంది. అతనినుండి వైదొలగితే మరణం తప్పదు.

5 ఈ కీర్తనకారునికి, ఆ మాటకొస్తే పూర్వవేదభక్తుల కెవరికిగూడ, మోక్షాన్నిగూర్చి స్పష్టంగా తెలియదు. వాళ్ళంతా తాము చనిపోయాక పాతాళానికి పోతామని తలంచారు, కాని మనకు మోక్షాన్ని గూర్చి రూఢిగా తెలుసు. పుణ్యకార్యాలు చేసినవాళ్ళు మోక్షానికీ పాపకార్యాలు చేసినవాళ్ళ నరకానికీ పోతారని మనం చిన్ననాడే నేర్చుకొంటాం. కనుక పాప కార్యాలు చేద్దామనే ప్రలోభం కలిగినప్పడు దానినుండి జాగ్రత్తగా తప్పకోవాలి. మనం లోకపు విలువలను లొంగకూడదు. సంసార జీవితంలోగాని మఠ జీవితంలోగాని మన తోడివాళ్ళ కొందరు లోకపు విలువలను ఆదరిస్తుంటారు. వాళ్ళ మనలను కూడ మభ్యపెడతారు. కాని మనం ఆ దుష్ట విలువలకు లొంగకూడదు. ఆ ప్రలోభాలకు తలొగ్గకూడదు. ఈ కీర్తనలోని ప్రధానాంశం ఇదే.