పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఐగుప్తలో యోసేపు పోతీఫరు భార్య శోధనలనుండి తప్పించుకొన్నాడు - ఆది 89,9. బాబిలోనియాలో సూసన్న వృద్దులశోధనలనుండి తప్పించుకొంది - దాని 13, 23. అబ్రాహాం దేవుని సన్నిధిలో నడచాడు - ఆది 17,1. మరో కీర్తనకారుడు ప్రభువుని నిత్యం తన కన్నులముందట నిల్పుకొన్నాడు - కీర్త 16,8. ఈలాగే దైవసాన్నిధ్యం మనలనుగూడ శోధనలనుండి కాపాడుతుంది.

3.ఈ కీర్తనలోని భావాల ప్రకారం ప్రభువు మనలను నిత్యం గమనిస్తుంటాడు. కాని అతడు నిత్యం మనలను చూస్తుంటాడు అనుకొంటే మనకు భయం పుట్టదా? పోలీసువాడు రోడ్డుమీద నిలబడి జనాన్ని గమనిస్తుంటాడు. నేరం చేసినవాళ్ళను పట్టుకొని జరిమాన విధిస్తాడు. దేవుడు మనలను ఓ పోలీసువాడిలాగ గమనించడు, మనకు శిక్ష విధించడు. అమ్మా నాన్నగూడ పసిబిడ్డను నిత్యం గమనిస్తుంటారు. ఆ బిడ్డను నీళ్ళూ నిప్పూలాంటి అపాయాలనుండి కాపాడుతూంటారు. దేవుడు మనలను ఈయమ్మ నాన్నలాగ గమనిస్తుంటాడు. అతడు మనలను గమనించేది మనలను శిక్షించడానికిగాదు, రక్షించడానికి, ఆ ప్రభువు మూతపడని కన్నులాగ నిరంతరం మనలను చూస్తుంటాడు. కర్మసాక్షిలాగ మన పనులన్నిటినీ పరిశీలిస్తుంటాడు. ఐనా అతనిపట్ల మనకు భయంకాదు, నమ్మకముండాలి. ఎందుకంటే అతడు అమ్మా నాన్నలాంటివాడు.

4."నాకు నిర్ణయింపబడిన దినాలన్నీ నీగ్రంథంలో లిఖింపబడే ఉన్నాయి" అన్నాడు కీర్తనకారుడు (16). ఈ గ్రంథం దేవుని జ్ఞాపకశక్లేనని చెప్పాం. భూతభవిష్యద్వర్త మానాల్లోని జనులందరూ, వాళ్ళ పనులన్నీ దేవునికి తెలుసు. అతడు మనలనూ మన కార్యాలనూ నిరంతరం జ్ఞప్తియందుంచుకొంటాడు. కనుక మనం అతన్ని నమ్మాలి. అతని సహాయం అడుగుకోవాలి. అతనిమీద ఆధారపడి జీవించాలి. ఆపదలూ కష్టాలూ వచ్చినపుడు అతన్ని మరీ అధికంగా నమ్మాలి.

5."రేయింబవళ్ళు నీకు సరిసమానం' అన్నాడు భక్తుడు (12). మూర్ధ మానవులు చీకట్లో దొంగతనం, హత్య వ్యభిచారం మొదలైన నేరాలు చేసి ఎవరూ చూడలేదులే అనుకొంటారు. కాని వాళ్ళ నరుల కన్నుగప్పినా దేవుని కన్నుగప్పలేరు. దేవుని శిక్షను తప్పించుకోలేరు. ఇంకా నరులు చాటుమాటున ఎన్నోపాడుపనులు చేస్తారు. దేవుడు మన పాపకార్యాలనూ దురాలోచనలనూ గూడ గుర్తిస్తుంటాడు. కనుక జీవితంలో నిజాయితీని అలవర్చుకోవాలి. ఈ కీర్తన మనకు ఈ నిజాయితీని నేర్పుతుంది.