పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నేను మేల్కొనినపుడు" అనే వాక్యం హిబ్రూమూలంలో భ్రష్టమైపోయింది. దాని అర్థమేమిటో ఇప్పడు ఎవరికీ తెలియదు. ఈ వాక్యాన్ని "నేను మేల్కొనినపుడు గూడ నిన్నర్ధం జేసికోలేను" అని కూడ అనువదించవచ్చు

19-20. ఈ చివరి భాగంలో తనమీద నేరాలు మోపిన శత్రువులు నాశమైపోవాలని ప్రార్ధిస్తున్నాడు.
దుషులూ దౌర్జన్యపరులూ ఐన శత్రువులు భక్తుని మీద నేరాలు మోపారు. దేవుణ్ణి దూషించారు. కనుక వాళ్ళు నాశమైపోతే బాగుంటుందని రచయిత ప్రార్థన.

21-22. ఈ శత్రువులు దేవుణ్ణి ద్వేషించేవాళ్ళు. అతనికి ఎదురు తిరిగేవాళ్లు, కీర్తనకారుడు దేవుణ్ణి నమ్మినవాడు. కనుక అతడు దేవుని శత్రువులనుగా భావించి అసహ్యించుకొన్నాడు.

23. భక్తుడు విగ్రహారాధనంలాంటి పాపమేదో చేసాడని శత్రువులు అతనిమీద నిందలు మోపారు. కాని అతడు నిర్దోషి. కనుక అతడు తన హృదయాన్ని పరిశీలించి చూడమనీ, తనలో దుష్టాలోచన లేమైనా ఉన్నాయేమో పరీక్షించి చూడమనీ, భగవంతుణ్ణి వేడికొంటున్నాడు. ఈలాంటి ప్రార్థన చేయాలంటే గొప్ప చిత్తశుద్ధి ఉండాలి.

24. వినాశ మార్గం, జీవనమార్గం అని రెండు త్రోవలున్నాయి. కీర్తనకారుడు, అతని శత్రువులు శంకించినట్లుగా వినాశ మార్గంలో నడువలేదు. అతడు సజ్జనుడు. కనుక తన్ను జీవనమార్గంలో నడిపించమని దేవుణ్ణి అడుగుకొంటున్నాడు. ఈ జీవనమార్గమే శాశ్వత మార్గం, అదే ధర్మశాస్త్ర మార్గంకూడ - మత్త 7, 13.

4 ప్రార్థనా భావాలు

1. చాలమందికి దేవుడు అనుభవానికి రానేరాడు. అతడెక్కడో మోక్షంలో ఉన్నాడనుకొంటారు. కాని భక్తులు అతన్ని వ్యక్తిగతంగా అనుభవానికి తెచ్చుకొన్నారు. ఎల్లవేళలా అతని సాన్నిధ్యాన్ని గుర్తిస్తూ వచ్చారు. ఈ కీర్తనకారుడే అందుకు సాక్షి. ఇతడు భగవంతుని గూర్చి పరోక్షంగా మాట్లాడడు. అతని గుణగణాలను పేర్కొనడు. ఓ స్నేహితుళ్లాగా అతనితో ముఖాముఖి సంభాషిస్తుంటాడు. ఇతని గీతాన్ని చూచి మనం దేవునిపట్ల వ్యక్తిగతమైన అనుభవం కలిగించుకోవడం నేర్చుకోవాలి. అతనితో సంభాషించడం అలవాటు చేసికోవాలి.
2. ఈ కీర్తనకారునిలాగే మనంకూడ దైవసాన్నిధ్యాన్ని అనుభవానికి తెచ్చుకొంటే భక్తితో జీవిస్తాం. పాపం చేయడానికి జంకుతాం. ఈ సాన్నిధ్యబలంవల్లనే పూర్వం