పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/243

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

15 ప్రభూ! నీవు నా పెదవులను విప్పము
నేను నీ స్తుతుల నుగ్గడించెదను

16 నీవు బలుల వలన సంతృష్టి చెందవు
నేను దహనబలి నర్పించినవో నీవు ప్రీతి జెందవు

17 దేవా! నే నర్పించు బలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే
పశ్చాత్తాపపూరితమును విషయాన్వితమునైన హృదయమును నీవనాదరము చేయవు

18. నీవు నెనరుతో సియోను నాదుకొనుము
యెరూషలేము ప్రాకారములను పునర్నిర్మింపుము

19. అప్పడు నీవు దహనబలులు సంపూర్ణ హోమములు
మొదలుగాగల ఉచితములైన బలులవలన సంతృప్తి చెందుదువు
అప్పడు జనులు నీ బలిపీఠము మీద కోడెల నర్సింతురు.

1. పరిచయం

ఇది విలాప కీర్తనల వర్గానికి చెందింది. ఈ వర్గం కీర్తనల్లో శోకభావాలూ పశ్చాత్తాపభావాలూ విరివిగా కన్పిస్తాయి. ఈ కీర్తనల్లో భక్తులు తమ పాపాలకు పశ్చాత్తాప పడ్డారు. తమకు కలిగిన ఆపదలకుగాను, అనగా వ్యాధులు మృత్యువు పరపీడనం యుద్ధం క్షామం మొదలైన వాటికిగాను, దేవునికి మొరపెట్టారు. తమ్మ రక్షించమని దేవునికి మనవి చేసారు. ఈ కీర్తనల్లో చాల లోతైన భావాలు తగులుతాయి.

ప్రాచీనకాలం నుండీ శ్రీసభ ఏడింటిని పశ్చాత్తాప కీర్తనలుగా భావించి ఆరాధనలో జపిస్తూ వచ్చింది. అవి 6, 32, 38, 51, 102, 130, 143. ఈ యేడింటిలో 51వ కీర్తన అతి శ్రేష్టమైంది. ఎవడో భక్తుడు పాపంచేసి చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడ్డాడు. ఆ ఉదంతమే ఈ గీతం. దీన్ని యూదులు కిప్పూర్ అనే ప్రాయశ్చిత్త దినాన ఆరాధనలో జపించేవాళ్లు. ఇది నూత్నవేదం బోధించే నైతిక బోధలకూ హృదయశుద్ధికి చేరువలోకి వస్తుంది. కీర్తనకారుడు ఈ గేయాన్ని తన వ్యక్తిగత పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చడానికే వ్రాసికొన్నా డొక్కశుద్ధి కలవాళ్ళందరూ తమ పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసికోడానికి గూడ దీన్ని వాడుకోవచ్చు, విశేషంగా పాపసంకీర్తనం చేసేప్పడు దీన్ని భక్తితో జపించవచ్చు. దీని భావాలు చాల లోతైనవి, విశ్వవ్యాప్తమైనవి కూడ.