పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/244

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బతెబాతో పాపంచేసాక దావీదురాజే దీన్ని వ్రాసాడని పూర్వవాఖ్యాతలు వాకొన్నారు. కాని ఈ కీర్తనలోని ఆంతరంగిక భావాలనుబట్టి యిది ప్రవాసానంతరం, దేవాలయ పునర్నిర్మాణానికి ముందు పుట్టివుండవచ్చు. బహుశః 5వ శతాబ్దానికి చెందింది.

2. విభజనం

1-3 దేవుణ్ణి సంబోధించడం
4-6 పాపి తన పాపాలను ఒప్పకొనడం
7-9 తన పాపాలు మన్నించమని దేవుణ్ణి అడుగుకోవడం
10-13 ఆంతరంగికమైన నూత్నత్వం కొరకు ప్రార్ధనం
14-17 వందన సమర్పణం, బల్యర్పణం
18-19 రెండవ కీర్తనకారుడు చేర్చిన చరణాలు

.

3. వివరణం

1-2 భక్తుడు కరుణా నెనరుగల దేవుడు తన పాపాలను మన్నించాలని అడుగుకొంటున్నాడు. తనకూ దేవునికి మధ్య తెగిపోయిన సంబంధాన్ని ఆ ప్రభువు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాడు.

ఇక్కడ తుడిచివేయడం, కడగడం, శుద్ధిచేయడం అనే క్రియల విశేషార్గాన్ని గమనించాలి. భగవంతుడు నరుని పాపాలను తన శిక్షాగ్రంథంలో లిఖిస్తాడు - నిర్గ 32, 32. ఆ గ్రంథం నుండి తన పాపాలను తుడిచివేయమని భక్తుడు మనవి చేస్తున్నాడు. పాపం వలన అతడు మురికిబట్టలాంటివా డయ్యాడు. కనుక తన్ను కడగమని వేడుకొంటున్నాడు. పాపం కుష్ట రోగం లాంటిది. ఈ కుష్ట నుండి తన్ను శుద్ధి చేయమని అర్ధిస్తున్నాడు.

3. భక్తుడు చిత్తశుద్ధితో తన తప్పలను ఒప్పకొంటున్నాడు. తనకు తానే శిక్ష విధించుకొంటున్నాడు.

4. పాపం చేసినపుడు మనకు మనమే ద్రోహం చేసికొంటాం. ఇతరులకుగూడ ద్రోహం చేస్తాం. కాని ఇంతకంటె అదనంగా దేవునికి ద్రోహం చేస్తాం. కనుకనే “నీకే ద్రోహంగా నేను పాపం చేసాను" అంటున్నాడు. పాపంలోని ముఖ్యాంశం ఈ దైవద్రోహమే. పాపం దేవుని దృష్టిలో దుష్కార్యం. అది దేవునిమీద తిరుగుబాటు. అది మనలను దేవుని " నుండి వేరుపరుస్తుంది. దేవుడు పాపికి తీర్పు విధిస్తాడు, అతన్ని దోషినిగా నిర్ణయిస్తాడు.