పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/233

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాళ్ళు దైవశాపానికి గురౌతారు. కనుక ఉత్తములు ఎల్లప్పడు మంచి త్రోవలో నడవాలి. వేదగ్రంథ పఠనం వలన తెలియవచ్చే దైవచిత్తమే ఈ మంచి త్రోవ.

4. ప్రార్థనా భావాలు

1. ధర్మగ్రంథ పఠనంవలన దైవచిత్తం తెలుస్తుంది. ఈ దైవచిత్తానికి లొంగివుండడాన్నే యూదులు ప్రధాన భక్తిగా గణించేవాళ్లు, నరుడు ధర్మగ్రంథాన్నిధ్యానం చేసికొని, దైవచిత్తాన్ని అర్థంజేసికొని, ఆ చిత్తానికి లొంగి జీవించాలని ఈ మొదటి కీర్తన బోధిస్తుంది. నేటి మన జీవితానికీ ఈ సూత్రం అక్షరాల వర్తిస్తుంది. క్రైస్తవ భక్తుడు రోజూ ఓ పావుగంట కాలమైనా బైబులు గ్రంథం చదువుకొని ప్రార్ధన చేసికోవాలి. ఆ ప్రార్థనలో దైవచిత్తాన్ని అర్థం చేసికోవాలి. ఆ దివ్యచిత్తం ప్రకారం జీవించాలి. ఇదే అతడు నడువవలసిన బాట.
2. మత్తయి 7, 13-14 రెండు త్రోవలను పేర్కొంటుంది. మొదటిది ఇరుకైన త్రోవ. కొద్దిమంది మాత్రమే ఈ బాటవెంట ప్రయాణం చేస్తారు. కాని యిది జీవానికి చేరుస్తుంది. రెండవది విశాలమైన త్రోవ, అధిక సంఖ్యాకులు దీనిలో పయనిస్తారు. కాని యిది వినాశానికి కొనిపోతుంది. భక్తిమంతులు ఇరుకు త్రోవలో పోవాలి. ఈ కీర్తన బోధించేది కూడ ఈ రెండు మార్గాలను గూర్చే కావుననే దీనికి "రెండు త్రోవలు" అని పేరు.
3. కీర్తనకారుడు ఈ కీర్తనలో మోషే ధర్మశాస్తాన్ని పాటించమని చెప్పాడు. నూత్న వేదంలో క్రీస్తు బోధలే మన ధర్మశాస్త్ర మౌతాయి. ఆ బోధలు మన హృదయంలో నూరంతలుగా పంట పండాలి. కాని ఈలా పండాలంటే, మన హృదయాలు సారవంతమైన నేలలా ఉండాలి - మత్త 13,8.
4. మనం పోవలసిన త్రోవ క్రీస్తే, అతడు ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలనూ తండ్రిచిత్తాన్ని పూర్తిగా పాటించాడు. పూర్వవేద ప్రజలకు మోషే మార్గం, మార్గదర్శకుడు. నేడు మనకు క్రీస్తు మార్గం, మార్గదర్శకుడు - యోహా 14,6. కనుక మనం నిరంతరం క్రీస్తనే త్రోవలో నడవాలి. ఇంకా, యీ క్రీస్తు మంచి ఫలాలు ఫలించే చెట్టకూడ. మనం ఆ చెట్టు ఫలాలు భుజిస్తాం - దర్శ 22, 1-2.
5. సజ్జనుడు ధర్మశాస్త్ర పఠనంద్వారా మంచి చెట్టులాగ ఫలిస్తాడని చెప్తుంది ఈ కీర్తన, యిర్మీయా ప్రవచనం 17, 5-8 కూడ ఇదే భావాన్ని పేర్కొంటుంది. ఈ వాక్యాలను భక్తితో ధ్యానం చేసికొంటే వాక్యభక్తి పెరుగుతుంది.