పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవది, పాపోచ్చారణంలో ఈ బాధలను గురువుకి వివరించి చెప్పాలి. అతని సలహాలను పాటించాలి. పాపోచ్చారణ సంస్కారం ఈ యాంతరంగికమైన వ్యాధులను గూడ నయం జేస్తుంది. ఇంకా మనం చెల్లించే ప్రాయశ్చిత్తాన్ని గూడ భక్తితో చెల్లించాలి. దానికిగూడ ఈ బాధలను తొలగించే శక్తి వుంటుంది.

ప్రార్ధనా భావాలు

1. మనం గుర్రాలను అదుపులో వుంచుకోవడానికి వాటి నోటిలో కళ్ళెం పెడతాం. ఎద్దుముక్కులో త్రాడు గుచ్చుతాం, ప్రాయశ్చిత్త క్రియకూడ పాపపు మానవులమైన మనకు ఓ కళ్ళెంలాను ముకుదాడులాను ఉపయోగపడుతుంది. దాని ద్వారా మన పాశవిక గుణాలు అదుపులోకి వస్తాయి. మనం భవిష్యత్తులో మళ్ళా పాపం చేయకుండా జాగ్రత్తపడతాం. ప్రాయశ్చిత్తం మన పాపపు గాయాలను మాన్పి నయం చేస్తుంది. భావి పాపం నుండి మనలను కాపాడుతుంది కనుక దాన్ని భక్తితో చెల్లించాలి.

2. శ్రీసభ అర్పించే ఓ కృతజ్ఞతా ప్రార్ధన యిది. "ఓ ప్రభూ! నీవు అద్భుతంగా నరుడ్డి సృజించావు. అంతకంటే అద్భుతంగానే అతన్ని పాపాన్నుండి పునరుద్ధరించావు నీవు నరుడ్డి అతని పాపానికి అతన్ని వదలివేయవు. అతన్ని కరుణతో వెదుక్కొంటూ వస్తావు. నీవు నీ కుమారుణ్ణి ఈలోకం లోకి పంపావు. అతడు తన మరణంద్వారా మా పాపాన్నీ మరణాన్నీ నాశం చేసాడు. తన వుత్తానంద్వారా మాకు జీవాన్నీ ఆనందాన్నీ ప్రసాదించాడు. ఇంకా నీవు నీ యాత్మనుగూడ మా హృదయాల్లోకి పంపావు. ఆ యాత్మడు మమ్మ నీ బిడ్డలనుగాజేసి నీ రాజ్యానికి వారసులను జేస్తాడు. ఈ భాగ్యాలన్నీ చాలవో అన్నట్లు పాపోచ్చారణ సంస్కారంద్వారా నీవు మా హృదయాలను శుద్ధిచేసి మమ్మ పాపదాస్యంనుండి తప్పిస్తూంటావు. దానిద్వారా మేము రోజు రోజుకీ నీ ప్రియకుమారుని పోలికను అధికాధికంగా పొందుతూంటాం. ಇಟ್ಟಿ Š కృపను తలంచుకొని నీకు వందనాలు అర్పిస్తున్నాం". ఈ ప్రార్ధనంలో మన రక్షణ చరిత్ర అంతా యిమిడి వుంది, విశ్వాసులు అపరాధాన్ని చెల్లించాక ఈలాంటి ప్రార్థనను భక్తితో జపించవచ్చు.

3. ఇంకో ప్రార్ధనం ఇది. "మన ప్రభువు తప్పిపోయిన వాళ్ళను వెదక్కుంటూ వస్తాడు. చెల్లాచెదరైనవాళ్ళను మళ్లా మందలోనికి చేరుస్తాడు. గాయపడిన వాళ్ళకు కట్లకడతాడు. దుర్భలులకు బలాన్ని ప్రసాదిస్తాడు. అలాంటి ప్రభువుని మనకుసాయం చేయమని వేడుకొందాం.”