పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/212

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తావుల్లో కన్పిస్తుంది. ఉదాహరణకు కొర్నేలి పేదలకు దానధర్మాలు చేసిన భక్తుడు — అచ 10, 1-2.

4. ఆంతరంగికమైన ఆరోగ్యం

జీవితంలో మనకు చాలా బాధలు ఎదురౌతాయి. ఈ బాధలవల్ల మనం హైన్యభావాలవంటి మనస్తత్వాలు, కోపం వంటి మనోభావాలు, త్రాగుడు వంటి దురభ్యాసాలు అలవర్చుకోవచ్చు. మామూలుగా ఈ బాధలు మన పూర్వ జీవితంలో జరిగిన కొన్ని విషమ సంఘటనలను ఆధారంగా జేసికొని ఉద్భవిస్తాయి. ఈ పూర్వ సంఘటనలు చాలవరకు మన బాల్యప్రాయానికి సంబంధించినవి. మనం నాలుగైదేండ్ల ప్రాయంలో వున్నపుడు కొన్ని బాధాకరమైన సంఘటనలు జరిగివుంటాయి. వాటి స్మృతులు మన అజ్ఞాత మనస్సులో గూడుకట్టుకొని వుంటాయి. ఆ పూర్వ సంఘటనలను మనమిప్పడు గుర్తుకి తెచ్చుకోలేకపోయినా బాధాకరమైన వాటి స్మృతులు మాత్రం మన అజ్ఞాత మనస్సుమిూద పనిచేస్తూనే వుంటాయి. అవి పిలకలు వేస్తూంటాయి. వీటివల్లనే ఇప్పడు మన జీవితంలో హైన్యభావాలవంటి బాధలు ఏర్పడతాయి. అనగా ఆనాటి బాల్యస్మృతలవల్ల ఇప్పడు కానిపనులు చేస్తాం. కనుక ఇవి వ్యాధుల్లాంటివి. ఉదాహరణకు రాజు చిన్నపిల్లవాడుగా వున్నపుడు ఎవరో పెద్దవాళ్ళు ఏడ్పించి జడిపించారు. ఆ సంఘటనం ఇప్పడతనికి గుర్తుకి లేదు. కాని దాని స్మృతి మాత్రం అతని అజ్ఞాత మనసులోవుండి బాధపెడుతుంది. అందుకే అతడు సులభంగా జనం దగ్గరికి రాడు. ఒంటరిగా వుండిపోతూంటాడు. పిరికివాడిలా కన్పిస్తాడు.

ఈ బాల్యస్మృతులు మనలను విశేషంగా మూడు రంగాల్లో బాధిస్తూంటాయి.

1. మన మనోధర్మాలు విషమించి మనలను బాధిస్తాయి. దీనివల్ల మనకు విపరీతమైన సిగూ బిడియమూ విచారమూ ఒంటరిపాటూ హైన్యభావాలు ఏర్పడతాయి.

2. మన మానసిక గుణాలుకూడ ప్రకోపించి మనలను పాపంవైపు నడిపిస్తాయి. ఈ కారణంవల్ల కోపమూ ద్వేషమూ వైరమూ పగా అసూయా కామమూ మొదలైన దురుణాలు మన హృదయంలో మోతాదుకు మించి చోటు చేసికొంటాయి.

3. కొన్ని దురభ్యాసాలు కూడ మనలను నిర్బంధిస్తాయి. ఇందువల్ల మనం మద్యపానప్రీతి, ముష్టిమైథునం మొదలైన దురభ్యాసాలకు అలవాటుపడతాం. ఇక ఆ చెడు అలవాట్ల మనలను వదలవు. అవి మనలను నిర్బంధపెడతాయి.

ఈ రోగాలను వదిలించుకోవాలంటే మనం రెండు పనులు చేయాలి. మొదటిది, నమ్మకంతో ప్రభువుని ప్రార్థన చేసికోవాలి. అతడు మనకు రక్షకుడు, ఆరోగ్యదాత కనుక ఆ ప్రభువు మనలను కరుణించి ఈ రోగాలను కుదుర్చుతాడు.