పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూస:CENTER

పాపాలకు మనస్తాపపడ్డం, పాపోచ్చారణం, పాపపరిహారం చెల్లించడం మూడు పాపోచ్చారణంలో పాపి చేయవలసిన పనులు. ఈ మూడు ప్రక్రియలు క్రమంగా మూడధ్యాయాల్లో పరిశీలిద్దాం. ప్రస్తుతాధ్యాయంలో మనస్తాపాన్ని గూర్చి విచారిద్దాం. పాపోచ్చారణ విధిలోకెల్లా అతి ప్రధానమైన కార్యం యిదే. ఇక్కడ మూడంశాలను ప్రస్తావిద్దాం.

1. మనస్తాపం

బ్రెంటు మహాసభ బోధల ప్రకారం మనస్తాపమంటే మన పాపాలకొరకు పూర్ణంగా పశ్చాత్తాపపడి, పాపాన్ని అసహ్యించుకొని, ఇకమిూదట అలాంటి పాపాన్ని చేయనని నిశ్చయించుకోవడం. ఈ వాక్యంలో మూడు భావాలున్నాయి. వాటిని క్రమంగా పరిశీలిద్దాం.

1) పూర్ణపశ్చాత్తాపం, పాపంద్వారా మనం భగవంతునికి ద్రోహం చేస్తాం. కనుక మన హృదయంలో పశ్చాత్తాపపడాలి. దేవుని ఆజ్ఞలు విూరామని కాదు, తండ్రిలాంటి దేవునికి ద్రోహం చేసాంకదా అని పశ్చాత్తాపపడాలి. ఈ పశ్చాత్తాపం ప్రధానంగా మనమనసులో వుంటుంది. కనుక ఎవరైనా ఎప్పడైనా పశ్చాత్తాపపడవచ్చు. అది దుఃఖించడం, కన్నీరుగార్చడం ఏడ్వడం మొదలైన మనోధర్మాలస్థాయికి (Feelings) చేరుకోనక్కరలేదు. కొందరిలో ఆ దశకు కూడ చేరుకుంటుంది. అలా అయితే మరీ మంచిదే.

పశ్చాత్తాప మనేది రెండు విధాలుగా కలగవచ్చు. కొందరు దేవుడు మన పాపాలకు మనలను నరకయాతనలతో శిక్షిస్తాడు అనుకొని భయపడతారు. అతన్ని ఓ పోలీసువాడ్డి చూచిన చూపున చూస్తారు. అతడు మన పాపాలకు మనలను బంధించి నరకంలోబెట్టి బాధిస్తాడేమోనని భయపడి పశ్చాత్తాపపడతారు. కాని ఈలాంటి పశ్చాత్తాపం మంచిదికాదు, ఇది భయమనస్తత్వానికి దారితీస్తుంది. మరికొందరు దేవుణ్ణి ప్రేమగల తండ్రిలాంటివాణ్ణిగా భావిస్తారు. పాపంద్వారా ఆ తండ్రి హృదయాన్ని నొప్పించాంకదా అని బాధపడి పశ్చాత్తాపపడతారు. అతని అనురాగాన్ని కరుణను కాదని పాడుపని చేసాంకదా అని పరితపిస్తారు. ఇది ఉత్తమమయిన మనస్తాపం.

ఐనా దేవుని ప్రేమనూ కరుణనూ తలంచుకొన్నప్పడు మనసు కరగనివాళ్లు నరకయాతనలను తలంచుకొని పశ్చాత్తాపపడవచ్చు. అలాంటివాళ్ళకు ప్రేమకాకపోయినా, కనీసం భయమైనా పరివర్తనం పుట్టిస్తుంది. అది చాలు.