పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/191

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డదిఅన్నిసార్లు వాడుకోవచ్చు. ఇంకా చావైన పాపాలకే గాక స్వల్పపాపాలకుగూడ దీన్ని వినియోగించుకోవచ్చు. ఇవి ఈ విధిలోని సౌకర్యాలు. తొమ్మిదవ శతాబ్దం నుండి నేటివరకు- అనగా 11 శతాబ్దాల కాలం-గురువుతో వ్యక్తిగతంగాను రహస్యంగాను చేసే ఈ పాపోచ్చారణం ఎందుకు అని నేడెవరైనా ప్రశ్నిస్తే అది వెర్రి ప్రశ్నేఔతుంది. బహిరంగమైన రూపంలోగాని వ్యక్తిగతమైన రూపంలోగాని పాపోచ్చారణం తొలిశతాబ్దం నుండీ శ్రీసభలో వాడుకలో వుందని పైవివరణంలో నిరూపించాం. కనుక నేడీ సంస్కారాన్ని నిరాకరిస్తే కుదరదు.

4. ప్రస్తుత కాలానికి తగినట్లుగా

పాపోచ్చారణంలో దేవుడు మనకు న్యాయాధిపతియై తీర్పు చెప్తాడు అనే భావం బ్రెంటుసభ ముగిసాక 16-19 శతాబ్దాల్లో బాగా ప్రచారంలోకివచ్చింది. అప్పటినుండి వేదాంతులు పాపోచ్చారణం ఓ న్యాయస్థానంలాంటిదని బోధిస్తూవచ్చారు. పాపి దోషిగా దేవునిముందు నిల్చి తన దోషాలను తెలియజేసుకొంటాడని, దేవుడు ఓ న్యాయాధిపతిగా అతనికి తీర్పుజెప్పి ప్రాయశ్చిత్తం విధిస్తాడనీ చెపూవచ్చారు. పాపోచ్చారణంలో దేవుడు న్యాయాధిపతిగా పనిచేసేమాట నిజమే. ఐనా ఇది అంత శ్రేయస్కరమైన భావం కాదు. ఈ సంస్కారంలో ముఖ్యమైన విషయం, దేవుడు కరుణతో క్రీస్తుద్వారా మన పాపాలను మన్నించడం, పాపి దేవునితోను శ్రీసభతోను రాజీపడ్డం.

కనుక వాటికన్ మహాసభ పాపోచ్చారణం ఓ న్యాయస్థానం లాంటిదన్న పూర్వభావాన్ని తొలగించి ఈలా బోధించింది. "పాపోచ్చారణ సంస్కారంలో పాలుపొందేవాళ్ళ దేవుని కరుణవల్ల తమ పాపాలకు మన్నింపు పొందుతారు. పైగా వాళ్ళ శ్రీసభతోగూడ రాజీపడతారు. ఆ శ్రీసభకూడ తన ప్రేమద్వారా, ప్రార్ధనలద్వారా, సదాదర్భంద్వారా ఆపాపులకు పరివర్తనం కలిగిస్తుంది." ఈ వాక్యాల్లో కరుణాళువైన దేవుడు మన పాపాలను మన్నిస్తాడు, మనం శ్రీసభతో మల్లా సమాధానపడతాము అనే రెండు భావాలు వున్నాయి. ఈ సంస్కారాన్ని గూర్చిన యధార్ధమైన భావాలు ఇవే.

వాటికన్ మహాసభ ప్రాయశ్చిత్తవిధిని ప్రస్తుతకాలానికి తగినట్లుగా సంస్కరించాలనీ, దాన్ని మరింత అర్థవంతంగా కన్పించేలా చేయాలనీ ఆజ్ఞయిచ్చింది. ఈ యాజ్ఞననుసరించి 1973లో క్రొత్తవిధిని తయారుచేసారు. ప్రస్తుతం శ్రీసభలో అమలులోవుంది ఈ క్రొత్తవిధే. ఈ నూత్నవిధిని ఈ పుస్తకంలోని చిట్టచివరి అధ్యాయంలో సవిస్తరంగా వివరిస్తాం.