పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జరుగుతుంది. ఇక శిష్యులు పొందిన పాపపరిహారాధికారాన్నే వాళ్ళ అనుయాయులైన పోపుగార్లు మేత్రాణులు గురువులు మొదలైన వాళ్లుకూడ పొందుతారు.

3.ప్రోటస్టెంటులు చెప్పే అర్థం

పైన మనం పేర్కొన్న వేదవాక్యాలు రెండూ పాపోచ్చారణ సంస్కారానికి ఆధారమని చెప్పాం. ఈ వాక్యాలను ఆధారంగా తీసికొని తొలిశతాబ్దాల నుండి క్రైస్తవ సమాజం ఈ సంస్కారాన్ని కొనసాగించుకొంటూ వస్తూంది. కాని 16వ శతాబ్దంలో చీలిపోయిన ప్రోటస్టెంటు క్రైస్తవులు పాపోచ్చారణ సంస్కారాన్ని అంగీకరించరు. మరివాళ్ళపై వాక్యాలకి ఏలా అర్థం చెప్తారు?\

ప్రోటస్టెంటు నాయకుల భావాల ప్రకారం "మిరెవరి పాపాలను క్షమిస్తారో అవి క్షమింపబడతాయి" అంటే పాపోచ్చారణ సంస్కారాన్ని జరిపించాలని భావం కాదు. పాప పరిహారాన్ని గూర్చి ప్రజలకు బోధించాలని భావం. ఇక్కడ క్రీస్తు ఉద్దేశించింది సంస్కారంగాదు, సువిశేషబోధ మాత్రమే. ఇందుకు ఆధారంగా లూకా సువార్తలో "ఆయన పేరిట హృదయ పరివర్తనమూ పాపక్షమాపణమూ ప్రకటింపబడతాయి" అనే వాక్యం వంది - 24, 47.

ఈ వాదానికి మన సమాధానం ఇది. క్రీస్తు మన పాపాలను పరిహరిస్తాడని మనం ప్రజలకు బోధ చేయాలని లూకా సువిశేషం చెప్పినమాటనిజమే. మనం ఈ బోధ తప్పకచేయాలి. కాని కొందరు అధికారులు ఒక సంస్కారం ద్వారా ప్రజల పాపాలను పరిహరిస్తారని గూడ యోహాను సువిశేషం ప్రత్యేకంగా పేర్కొంటుంది. దీనికి అనుగుణంగానే తొలి శతాబ్దాల నుండి క్రైస్తవసమాజం పాపోచ్చారణ సంస్కారాన్ని నిర్వహిస్తూ వచ్చింది. కేవలం 16వ శతాబ్దంలో వచ్చినవాళ్లు అంతకు పూర్వంనుండీ వాడుకలోనున్న ఈ సంస్కారాన్ని కాదంటే కుదరదు. ప్రోటస్టెంటులు వాదించినట్లు క్రీస్తు పాపోచ్చారణ సంస్కారాన్ని కాక పాపపరిహార బోధను మాత్రమే ఉద్దేశించినట్లయితే "మిూరు ఎవరి పాపాలు క్షమించరో అవి క్షమించబడవు" అనే పై యోహాను వాక్యానికి అర్థమేమిటి? పాపాలు క్షమించబడవు అని మనం సువిశేష బోధలో చెప్తామా? కనుక యోహాను 20,21-23ను పాపోచ్చారణ సంస్కారంగా అర్థంజేసికోవాలిగాని కేవలం సువిశేష బోధగా అర్థంచేసికోగూడదు.

ఈ సందర్భంలో పాపోచ్చారణ సంస్కారాన్ని అర్థం చేసికొనే తీరులో ప్రోటస్టెంటులకూ మనకూ వుండే ప్రముఖ వ్యత్యాసాలనుగూడా గమనించాలి.