పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

9. మెస్సియా కాలం వచ్చింది. ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. అతడు వచ్చింది ప్రధానంగా పాపపరిహారం చేసేందుకే. కనుకనే అతడు జన్మింపక పూర్వమే దేవదూత యోసేపుతో "నీవు అతనికి యేసు అని పెట్టాలి. అతడు ప్రజలను పాపం నుండి విమోచిస్తాడు" అని చెప్పాడు - మత్త 1.21. "యేసు" అనే పేరుకి రక్షకుడనే అర్థం,

క్రీస్తు బోధల ప్రకారం పాపం ప్రధానంగా హృదయగతమైంది. అంతరంగములోని భావాలను బట్టి నరుడు పవిత్రుడు గాని అపవిత్రుడు గాని ఔతాడు. దురాలోచనలు వ్యభిచారాలు దొంగతనాలు నరహత్యలు మొదలైనవన్నీ హృదయంనుండే పుట్టకవస్తున్నాయి. ఇవే నరుడ్డి మైలపరచేది - మార్కు 7,20-23. నరుడు శరీరంతో గాకుండ కేవలం హృదయంతో గూడ వ్యభిచారం చేయవచ్చు - మత్త 5,28. కనుక ఉపవాసం, ప్రార్ధనం, దానం చేయడం మొదలైనధర్మక్రియలన్నిటిలోను హృదయశుద్ధి ప్రధానం, డంబత్వం దేవునికి ప్రియపడదు.

పాపం ద్వారా నరుడు దేవుని నుండి వైదొలగిపోతాడు. పశ్చాత్తాపమంటే నరుడు మల్లా ఆ దేవుని దగ్గరికి తిరిగిరావడం. తండ్రివద్దకు తిరిగివచ్చిన దుడుకు చిన్నవాడు మనకాదర్శం. అతనిలాగే మనంకూడ పరలోకంలోని తండ్రి చెంతకు తిరిగి రావాలి - లూకా 15,21.

క్రీస్తు ఒక్క పాపాన్ని అతిఘనంగా యెంచాడు. అది ప్రజలు తన్ను విశ్వసించక పోవడం, తన్ను తండ్రి పంపిన మెస్సీయానుగా అంగీకరించకపోవడం - యోహా 8,24. రక్షణాన్ని కొనివచ్చే ప్రభువుని విశ్వసించకపోతే నరునికి రక్షణం ఏలా కలుగుతుంది? ఈలాంటిదే పరిశుద్దాత్మను గూర్చిన వాక్యం గూడ. "మానవులుచేసే ప్రతిపాపమూ క్షమింపబడుతుందిగాని పవిత్రాత్మను దూషిస్తే మాత్రం క్షమాపణం లేదు" -మత్త 12,3132. పవిత్రాత్మకు వ్యతిరేకంగా మాట్లాడ్డమంటే బుద్ధిపూర్వకంగా దేవుణ్ణి నిరాకరించడం. అతన్ని నమ్మకపోవడం, పశ్చాత్తాపపడకపోవడం, సహజంగానే అలాంటివాడికి రక్షణం వుండదు.

10. ఇక పౌలు భావాలను పరిశీలిస్తే అతడు ప్రపంచమంతా పాపంతో నిండివున్నట్లుగా భావించాడు. "అందరూ దేవుని నుండి వైదొలగినవాళ్ళే అందరూ దుర్మార్గపు పనులు చేసేవాళ్ళే మంచిని చేసేవాడు ఒక్కడూ లేడు” - రోమా 3.12. యూదులు యూదులు కాని అన్యజాతివాళ్ళూ అందరూ పాపానికి లొంగిపోయారు - 3,9. ఈ పాపం నుండి నరులను ఉద్ధరించేవాడెవడు? ప్రభువైన క్రీస్తు ఒక్కడే - 7,24-25.

11. అలాగే యోహాను భావాలను పరిశీలిస్తే అతడు పాపాన్ని అంధకారంగా "యెంచాడు. "దేవుడు జ్యోతిర్మయుడు. అతనిలో అంధకారం ఎంతమాత్రమూ లేదు'