పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/175

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


- 1యోహా 1,5. కాని తన సోదరుని ద్వేషించే పాపి అంధకారంలో సంచరిస్తాడు - 1యోహా 2,11. లోకంలో వెలుగు అవతరించినా పాపులైన నరులు ఆ వెలుగుకంటే చీకటినే యొక్కువగా ప్రేమించారు. పాపి వెలుగును ద్వేషిస్తాడు, వెలుగు దగ్గరికివస్తే తన తప్పుడు పనులు బయటపడతాయి కనుక అతడు వెలుగు చెంతకు రాడు - యోహా 3, 19-20. పాపాత్ముడు పిశాచానికి బానిస ఔతాడు-8,24. ఈ బానిసాన్ని తొలగించి దాని కర్తయైన పిశాచాన్ని కూలద్రోసేవాడు ప్రభువొక్కడే-12,31.

12. పూర్వవేదం పాపాన్ని దేవుణ్ణి ధిక్కరించడంగా భావించిందని చెప్పాం. పాపి తన దేవుడైన ప్రభువుని నిరాకరిస్తాడన్నాం. నూత్న వేదంకూడ ఈ భావాన్నే బోధిస్తుంది. కాని నూత్నవేదం అదనంగా క్రీస్తు మన పాపాలను తొలగిస్తాడని చెప్తుంది. ఆప్రభువు సిలువమిూద నెత్తురోడ్చి లోకంలోని నరులు చేసే పాపాలన్నిటికి శాంతి చేసాడు - 1యోహా 2,2.

2. పాపాన్ని అట్టే లెక్కచేయక పోవడం

పాపం అన్నింటికంటే దుష్టమైందనీ, దేవుడు పాపాన్ని లాగ మరి దేన్ని అసహ్యించుకోడనీ చెప్పాం. ఐనా ఆధునిక ప్రపంచం పాపాన్ని అట్టే లెక్కచేయడంలేదు. నరులు మంచినీళ్ళు తాగినంత సులభంగా పాపం చేస్తుంటారు. అలా పాపం చేసికూడ ఏ చింతా లేకుండ వుండిపోతారు.

నేటి మానవుడు పాపాన్ని లెక్కచేయకపోవడానికి కారణమేమిటి? నేడు నరులకు అసలు భగవంతునిపట్లనే భక్తి సన్నగిల్లిపోతూంది. ప్రపంచ వ్యాపారాల్లో మునిగితేలుతూ ప్రజలు దేవుణ్ణి పట్టించుకోవడంలేదు. ఆధ్యాత్మిక విలువలకు గౌరవమిూయడం లేదు. దేవుణ్ణి పట్టించుకోని నరుడు పాపాన్ని మాత్రం ఎందుకు పట్టించుకుంటాడు? కాని క్రైస్తవులమైన మనకు ఈ మనస్తత్వం తగదు. మన ప్రభువు ప్రధానంగా పాపాన్ని ఏవగించుకొనేవాడు, పాపాన్ని తొలగించేవాడు. "మనం పాపులమై యుండగా క్రీస్తు మనకొరకు మరణించాడు. దీన్నిబట్టే దేవునికిమనమిూదవున్న ప్రేమను అర్థంచేసికోవచ్చు" - రోమా 5,8. ఎవడో తన ప్రక్కయింటి బిడ్డను చంపివేసాడు. కాని ఆ బిడ్డ తల్లిదండ్రులు ఆ హంతకుని క్షమించి అతన్ని ఆదరంతో చూచారు. కనుక ఆ హంతకుడు తన నేరాన్ని మాటిమాటికి జ్ఞప్తికితెచ్చుకొని పశ్చాత్తాపపడేవాడు. ఈ యుపమానమే మనకీ వర్తిస్తుంది. మనం మన పాపంతో క్రీస్తుని సిలువవేసినవాళ్ళం. ఐనా తండ్రి నుండి క్షమాపణం పొందినా, మన తరపున మనం మాత్రం. మన నేరాన్ని మరచిపోగూడదు. అనగా మనం ఏనాటికీ మన పాపాలను విస్మరించగూడదు. 167