పుట:Bible Bhashya Samputavali Volume 08 Divya Satprasadam,Jnanasnanam P Jojayya 2003 332 P.pdf/173

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ్యక్తిగతమైంది కాక జాతిగతమైంది. ప్రభువు వాళ్ళను రక్షించేప్పుడు కూడ వ్యక్తిగతంగాకాక సామూహికంగా రక్షిస్తాడు, నూతవేదంలో మన పాపానికిగూడ ఈ సామూహిక లక్షణం వర్తిస్తుంది.

5. ధనికులు సాంఘికన్యాయాన్ని విూరి పేదజనులను పీడించేవాళ్ళు ఈ యన్యాయాన్ని ప్రవక్తలు నిశితంగా ఖండించారు. హృదయశుద్దిలేని ఆరాధనలవల్లా ఉపవాసాలవల్లా భగవంతునికి ప్రీతిగలగదు. కనుకనే "అక్కరలోవున్న తోడి జనాన్ని ఆదుకొంటే, అదే నాకు నచ్చిన ఉపవాసం" అన్నాడు యెషయా ప్రవచనంలో ప్రభువు - 58, 6–7, ఆమోసు సాంఘిక అన్యాయాలను ఖండిసూ

"నీతి ఓ నదిలాగ పొంగిపారాలి
న్యాయం ఓ జీవనదిలాగ ప్రవహించాలి"

అని పల్మాడు - 5,24.

6. పాపం నరునికి చావు తెచ్చిపెడుతుంది. పాపం చేయకముందు ఆదాముకి మరణంలేదు. పాపఫలితంగా అతడు చావవలసి వచ్చింది. సాలోమోను జ్ఞానగ్రంథకర్త ఈలా వ్రాసాడు. “దేవుడు నరుడ్డి అమరుడ్డిగా సృజించాడు. తన్నులాగే నరుడ్డిగూడ శాశ్వతుడ్డిగా చేసాడు. కాని పిశాచం అసూయవలన మరణం ఈ లోకంలోకి ప్రవేశించింది. పిశాచం పక్షాన చేరినవాళ్లు ఆ మరణాన్ని అనుభవించి తీరతారు” –2,23-24. పాపం తెచ్చిపెట్టే ఈ చావు భౌతికమైందీ, ఆధ్యాత్మికమైందీ కూడ. జీవమిచ్చేవాడు భగవంతుడొక్కడే కనుకపాపంద్వారా భగవంతుణ్ణి ధిక్కరించేవాడికి మరణమేగాని జీవనప్రాప్తి లేదు.

7. పూర్వవేద భావాల సంగ్రహం ఇది. పాపమనగా దేవుణ్ణి ధిక్కరించడం, భక్తునికీ దేవునికీ వ్యక్తిగతమైన సంబంధం వుంటుంది. పాపం ద్వారా ఈ సంబంధం తెగిపోతుంది. "నేను నీకే ద్రోహంగా పాపం చేసాను" అన్నాడు కీర్తనకారుడు - 51,4 ఈ చిన్నవాక్యంలో పాపాన్ని గూర్చిన పూర్వవేద బోధ అంతా యిమిడి వుంది. దేవునికీ భక్తునికీ మధ్యవుండే తండ్రీ బిడ్డా సంబంధం తెగిపోవడమే పాపం.

8. ఇక నూత్నవేద భావాలను పరిశీలిద్దాం. మెస్సీయా విజయం చేసే కాలం కరుణాపూరితమైంది. ఈ కాలంలో భగవంతుడు తన ప్రజలపట్ల విశేషకరుణ చూపుతాడు, తాను వాళ్ళతో క్రొత్తగా నిబంధనం చేసికొంటాడు. వాళ్ల పాపాలను ఇక స్మరించుకొనే స్మరించుకోడు - యిర్మీ 31, 31-34. ఇంకా ఈ కాలంలో ప్రభువు తన ప్రజలకు నూత్నహృదయాన్ని దయచేస్తాడు - వాళ్ళలోని రాతి గుండెను తొలగించి దాని స్థానే మాంసపు గుండెను నెలకొల్పుతాడు. అనగా వాళ్ళను తిరుగుబాటుదారుల నుండి విధేయులనుగా మారుస్తాడు - యెహె 36,26.